Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’.. ఓ చీకటి యుగం: ప్రధాని మోదీ

1975లనాటి ‘ఎమర్జెన్సీ’ కాలం దేశ చరిత్రలో చీకటి యుగమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌ (Mann Ki Baat) కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

Published : 18 Jun 2023 14:01 IST

దిల్లీ: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ (Emergency)’ కాలం చీకటి యుగమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాని (Democracy)కి మద్దతిచ్చే వారిపై అకృత్యాలు జరిగినట్లు గుర్తుచేశారు. ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌ (Mann Ki Baat) కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. ఇక్కడ రాజ్యాంగమే అత్యున్నతం. ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉన్న ఈ దేశంలో ‘ఎమర్జెన్సీ’ విధించిన జూన్ 25వ తేదీని మనం మరచిపోలేం’ అని పేర్కొన్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే విషయంలో భారత్‌ పెంపొందించుకున్న సామర్థ్యాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల బిపోర్‌జాయ్‌ తుపాను మిగిల్చిన విధ్వంసం నుంచి గుజరాత్‌లోని కచ్ ప్రజలు త్వరగా కోలుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘రెండు దశాబ్దాల క్రితం సంభవించిన విధ్వంసకర భూకంపం నుంచి ‘కచ్’ కోలుకోగలదా? అని అప్పట్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, స్థానికులు దీన్ని పటాపంచలు చేశారు. కొన్నేళ్లుగా భారత విపత్తు నిర్వహణ సామర్థ్యం మెరుగైంది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బిపోర్‌జాయ్‌ తుపాను గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించింది.

వచ్చే వారం అమెరికా, ఈజిప్టు పర్యటనల నేపథ్యంలో.. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారం కావాల్సిన ‘మన్‌ కీ బాత్‌’ను ముందుగానే నేడు ప్రసారం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. అందరూ యోగాను అలవర్చుకోవాలని, దానిని దినచర్యలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు