Fali S Nariman : సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95) కన్నుమూశారు.

Updated : 21 Feb 2024 11:43 IST

దిల్లీ: ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95)(Fali Nariman) కన్నుమూశారు. బుధవారం ఉదయం దిల్లీలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారీమన్‌..  సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులు కావడంతో దిల్లీ వెళ్లారు.  1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్‌ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ.. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్‌ రొహింటన్‌ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 నుంచి 2013 వరకు ఆయన కూడా సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు.

1991 నుంచి 2010 వరకు బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫాలీ నారీమన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఒక తరం ముగిసిందంటూ నారీమన్ మృతిపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా వంటి న్యాయనిపుణులు సంతాపం ప్రకటించారు.

ప్రధాని మోదీ సంతాపం..

‘ఫాలీ నారీమన్‌జీ న్యాయనిపుణులు, మేధావులలో ఒకరు. సామాన్య ప్రజలకు న్యాయాన్ని చేరువచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన కుటుంబం గురించే నా ఆలోచనంతా’ అని ప్రధాని మోదీ ఎక్స్‌(ట్విటర్)లో పోస్టు పెట్టారు. నారీమన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తమ సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని