Karnataka: సీఎం సర్‌.. యూఎస్‌ నుంచి మా వాళ్ల మృతదేహాలు తీసుకురండి!

మేరీల్యాండ్‌లో ఓ కన్నడిగుల కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని వారి స్వగ్రామంలో విషాదం నింపింది.

Published : 21 Aug 2023 18:50 IST

బెంగళూరు: అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఓ కన్నడిగుల కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని వారి స్వగ్రామంలో విషాదం నింపింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం సీఎం సిద్ధరామయ్యను ఆయన నివాసంలో కలిశారు. అమెరికాలో మృతిచెందిన తమ వారి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.  అమెరికాలోని మేరీల్యాండ్‌లో బాల్టీమోర్‌ కౌంటీలోని తమ నివాసంలో తుపాకీ తూటా గాయాలతో  యోగేశ్‌ హెచ్‌ నాగరాజప్ప (37), ప్రతిభా వై.అమరనాథ్‌ (37), యశ్‌ హొన్నాళి (6)  విగతజీవులుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దావణగెరె జిల్లాలోని మృతుల స్వగ్రామంలో విషాదం అలముకుంది. ఈ క్రమంలో వారి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చేలా సహకరించాలని సీఎం ఆయన నివాసంలో కలిసి కోరగా..  అందుకు తగిన  సాయం చేయాలని హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రజ్‌నీశ్‌ గోయల్‌ను సీఎం సిద్ధరామయ్య ఆదేశించినట్టు సీఎంవో కార్యాలయం తెలిపింది. 

దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హాలేకల్లుకు చెందిన యోగేశ్‌, బెంగళూరుకు చెందిన ప్రతిభకు తొమ్మిదేళ్ల కిందట వివాహం కాగా, అప్పటి నుంచి అమెరికాలో టెకీలుగా పని చేస్తున్నారు. అమెరికాలో వీరికి సొంత ఇల్లు కూడా ఉంది. తన కుమారుడు, భార్యను తుపాకీతో కాల్చి యోగేశ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నట్టు బాల్టిమోర్‌ కౌంటీ పోలీసు ప్రతినిధి ఆంటోనీ షెల్టన్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అనంతరం వీరు ముగ్గురూ చుట్టుపక్కల వారికి కనిపించలేదు. విధులకు హాజరు కాకపోవడం, ఫోన్‌ కాల్‌కు స్పందించకపోవడంతో సహోద్యోగులు వారి ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు