
కరోనాను కట్టడికే తొలి ప్రాధాన్యమన్న దీదీ!
ముందు హింసను అదుపులోకి తేవాలన్న గవర్నర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కడ్.. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసను వెంటనే అదుపులోకి తీసుకురావాలని కోరారు. దీదీని తన సోదరిగా అభివర్ణించిన ఆయన.. ఆమె తన విధులను రాజ్యాంగబద్ధంగా నిర్వర్తిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చెలరేగుతున్న హింసను అదుపులోకి తీసుకురావడమే సీఎం తొలి ప్రాధాన్యం కావాలని సూచించారు. మమత వెంటనే ఆ దిశగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
గవర్నర్ ప్రసంగానికి ముందు మాట్లాడిన దీదీ.. తన తొలి ప్రాధాన్యం కరోనా మహమ్మారిని కట్టడి చేయడమేనని తెలిపారు. దీనిపై వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడడం తన ఎజెండాలోని తర్వాతి అంశమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు శాంతియుతంగా ఉండాలని కోరారు. బెంగాల్ ప్రజలు హింసను హర్షించరని.. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అంతకుముందు పశ్చిమబెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కడ్ ఆమెతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆదివారం వెలువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 213 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. భాజపా 77 స్థానాలకే పరిమితమైంది. దీంతో మూడోసారి మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.