IndiGo: ఆ ఘటన ఆమోదయోగ్యం కాదు.. కేంద్రమంత్రి సింధియా

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

Published : 19 Jan 2024 02:07 IST

హైదరాబాద్‌: విమానం ఆలస్యం కావడంతో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటన ఇటీవల చర్చనీయాంశమైంది. ఇటువంటివి ఆమోదయోగ్యం కాదని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ నేపథ్యంలోనే జరిమానా విధించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సింధియా మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.

‘‘ముంబయి విమానాశ్రయం ఘటనకు సంబంధించి సమాచారం అందిన గంటల వ్యవధిలోనే అర్ధరాత్రి వేళ అధికారులందరితో సమావేశం నిర్వహించాం. వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేశాం. 24 గంటల్లోనే జరిమానాలు విధించాం. ప్రయాణికులు అసౌకర్యానికి గురైన విషయం వాస్తవం. వారు నేలపైనే భోజనం చేయాల్సి వచ్చింది. భద్రత విషయంలో రాజీ పడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అవమానకరమైన సంఘటన’’ అని సింధియా తెలిపారు.

ఎయిర్‌పోర్టులో నేలపైనే భోజనాలు.. ఇండిగోకు రూ.1.50 కోట్ల జరిమానా

ఉత్తరాదిన పొగమంచు వల్ల ఇటీవల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవా నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబయి ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే ఆలస్యమవడంతో కొందరు ప్రయాణికులు కిందికి దిగి, నేలపై కూర్చొని ఆహారం తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో కేంద్రం చర్యలకు దిగింది. ఇండిగోకు రూ.1.50 కోట్లు, ముంబయి విమానాశ్రయానికి రూ.90 లక్షల జరిమానా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని