ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో ‘కరోనా’ అనుమానితులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వణికిస్తున్న వేళ ఈ వైరస్‌ లక్షణాలతో ఆరుగురు దిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆస్పత్రిలో చేరారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో....

Published : 31 Jan 2020 18:49 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వణికిస్తున్న వేళ ఈ వైరస్‌ లక్షణాలతో ఆరుగురు దిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆస్పత్రిలో చేరారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి రిపోర్టుల కోసం చూస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శ్వాసకోశ ఇబ్బందులు, జ్వరం బారిన పడిన ఐదుగురు వారంతట వారే ఈ నెల 30న ఆస్పత్రిలో చేరారు. 

ఆస్పత్రిలో చేరిన వారిలో 24 ఏళ్ల యువతి 2015 నుంచి చైనాలో నివసిస్తుండగా.. జనవరి 29న అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చారు. మరో నలుగురు పురుషులు చికిత్స పొందుతున్న వారిలో ఉన్నారు. 45 ఏళ్ల ఓ వ్యక్తి జనవరి 23న భారత్‌కు రాగా.. 35 ఏళ్ల మరోవ్యక్తి చైనాలో ఏడేళ్లుగా ఉంటూ జనవరి 28న భారత్‌కు వచ్చారు. 19 ఏళ్ల మరో యువకుడు గతేడాది నవంబర్‌ నుంచి జనవరి 24 వరకు చైనాలో ఉండి ఈ నెల 25న భారత్‌కు వచ్చాడు. 34 ఏళ్ల మరో వ్యక్తి పదేళ్లుగా చైనాలో నివాసముంటూ జనవరి 16న భారత్‌కు పయనమయ్యారు. వీరంతా 30వ తేదీన ఆస్పత్రిలో చేరారు. వీరు కాక చైనా నుంచి జనవరి 11న వచ్చిన 32 ఏళ్ల మరో వ్యక్తి కూడా ఇదే ఆస్పత్రిలో అంతకుముందు నుంచి చికిత్స పొందుతున్నాడు. వీరి శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపామని, రిపోర్టుల కోసం చూస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే భారత్‌లో ఈ వైరస్‌ బయటపడింది. చైనా నుంచి భారత్‌కు వచ్చిన కేరళ విద్యార్థినిలో ఆ వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు కేరళలలోనే ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇంకోవైపు దీనిపై కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్సులో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు సన్నద్ధం చేసింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

ఇవీ చదవండి..

కరోనా.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

కరోనా భయం.. కదల్లేని దైన్యం

భారత్‌కు చేరిన కరోనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని