కేంద్రం తలచుకుంటే ప్రత్యేక హోదా గ్యారెంటీ!

ప్రత్యేక హోదా అంశంపై 15వ ఆర్థిక సంఘం స్పష్టతనిచ్చింది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని తెలిపింది..

Updated : 10 Aug 2022 15:29 IST

స్పష్టతనిచ్చిన 15వ ఆర్థిక సంఘం

దిల్లీ: ప్రత్యేక హోదా అంశంపై 15వ ఆర్థిక సంఘం స్పష్టతనిచ్చింది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తెలిపింది. ఈ వ్యవహారం ఏమాత్రం తమ పరిధిలోకి రాదని మధ్యంతర నివేదికలో తేల్చి చెప్పింది. ‘లుకింగ్‌ అహెడ్‌’ శీర్షికతో ఉన్న 7వ అధ్యాయంలో ఈ అంశాన్ని ఆర్థిక సంఘం తేటతెల్లం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని పలు రాష్ట్రాలు కోరాయని, వాటిని పరిగణనలోకి తీసుకొని కేంద్రమే తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సమతుల సమ్మిళితాభివృద్ధికి సంబంధించి మరింత మదింపు చేసి తుది నివేదిక అందిస్తామని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారు. 2014లో కేంద్ర మంత్రి వర్గం ఇదే అంశాన్ని తీర్మానించింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పక్కన పెట్టింది. అనేక కారణాలు చూపి కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. హోదా ఉన్నా లేకపోయినా నిధుల కేటాయింపులో ఎటువంటి లోటు ఉండబోదంటూ 14వ ఆర్థిక సంఘం పేర్కొందని కేంద్రం వివిధ సందర్భాల్లో  ప్రకటనలు చేసింది. దీనికి ప్రత్యమ్నాయంగా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని 2016 సెప్టెంబర్‌లో రాష్ట్రానికి ప్రకటించింది. దీని ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. అయితే 2017 మార్చిలో నిర్వహించిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకే దీన్ని పరిమితం చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రత్యేక ఆర్థిక సాయం విషయంలోనూ ప్రత్యేకంగా వచ్చిన వెసులుబాటు ఏమి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని ఇప్పటి వరకు కేంద్రం చెబుతూ వచ్చింది. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ఈ అంశంపై స్పష్టంగా వివరణ ఇవ్వడంతో కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని