ఖ్యాతిని కాపాడుకునేందుకే చైనా ప్రాధాన్యత: నిక్కీ హేలీ

బీజింగ్‌ నుంచి వెలువడే కరోనా బాధితుల సంఖ్యను నమ్మరాదని సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా మాజీ రాయబారి నిక్కీహేలీ చైనాపై ఆగ్రహం వ్యక్తంచేశారు...

Published : 03 Apr 2020 09:12 IST

కరోనా బాధితులు, మృతుల సంఖ్య సరైంది కాదు

వాషింగ్టన్‌: బీజింగ్‌ నుంచి వెలువడే కరోనా బాధితుల సంఖ్యను నమ్మరాదని సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా మాజీ రాయబారి నిక్కీహేలీ చైనాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ దేశం ప్రకటించిన కరోనా బాధితుల సంఖ్య సరికాదని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఈమేరకు గురువారం ఓ ట్వీట్‌ చేసిన హేలీ.. 150 కోట్ల జనాభా గల దేశంలో 82 వేల మందికే వైరస్‌ సోకిందని, 3300 మంది మరణించారని చైనా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇవి సరైన లెక్కలు కావనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్నాయని  ఆరోపించారు.  అక్కడే పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచ దేశాలకు సాయపడకుండా.. చైనా తన ఖ్యాతిని కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని దుయ్యబట్టారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సైతం ఇదే విషయమై సందేహం వ్యక్తం చేశారు. చైనా చెప్పే సంఖ్య కన్నా మరింత ఎక్కువ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

మరోవైపు చైనా నుంచి వెలువడే సంఖ్యను నమ్మరాదని సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ.. వైట్‌హౌస్‌కు సూచించింది. చైనాలో కచ్చితమైన సంఖ్యను తెలుసుకునేందుకు ఆ ఏజెన్సీ  విశ్వప్రయత్నం చేస్తుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చైనా నుంచి కచ్చితమైన సమాచారం రావాలని వైద్య నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికాలోనూ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే కచ్చితమైన సమాచారం ఉండాలని అధికారులు అంటున్నారు. వైరస్‌ వ్యాప్తి, దాని ప్రభావం తెలిస్తే గానీ సరైన స్పష్టత రాదంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆ దేశంలో 81,589 మంది వైరస్‌ బారినపడగా 3,318 మంది మరణించారు. 

ఇదే విషయమై అమెరికా జాతీయ భ్రదతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రియన్‌ మాట్లాడుతూ.. చైనా చెప్పే లెక్కలను నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అక్కడ నమోదయ్యే కేసుల సంఖ్యను తెలుసుకునే స్థితిలో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చైనా సామాజిక మాధ్యమాల్లోనూ చాలా మంది ఆ సంఖ్య తక్కువగా చెబుతున్నారనే విషయాన్ని పేర్కొంటున్నారని, అయినా వాటిని నిర్ధారించుకునే పరిస్థితి లేదని ఒబ్రియన్‌ తెలిపారు. ఇక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా వైరస్‌బారిన పడగా 51,485 మంది మరణించారని జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్శిటీ గణంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ఆ సంఖ్య 2,36,339 కాగా 5 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని