స్పెయిన్‌లో కరోనా మరణాలు తగ్గుముఖం

ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిన కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 1,60,000 దాటింది. వీటిలో ఎక్కువ మరణాలు యూరోపియన్‌ దేశాల్లో సంభవించడం గమనార్హం. అమెరికా తర్వాత వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న...... 

Published : 20 Apr 2020 00:40 IST

పారిస్‌: ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిన కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 1,60,000 దాటింది. వీటిలో ఎక్కువ మరణాలు యూరోపియన్‌ దేశాల్లో సంభవించడం గమనార్హం. అమెరికా తర్వాత వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న స్పెయిన్‌లో గత 24 గంటల్లో కరోనా బారినపడి 410 మంది మృతిచెందారు. మార్చి 22 నుంచి స్పెయిన్‌లో సంభవించిన కరోనా మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ అని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా కారణంగా 20 వేల మంది మృతిచెందారు. ఆదివారం కొత్తగా 4,218 కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,944కు చేరింది. ‘‘ప్రస్తుత గణాంకాలు వైరస్‌పై పోరులో మేం సరైన దారిలోనే వెళుతున్నాం అనే దానికి సంకేతం’’ అని స్పెయిన్‌ వైద్యారోగ్య అధికార ప్రతినిధి ఫెర్నాండో సైమన్‌ మరణాల సంఖ్యను ఉద్దేశించి అన్నారు.

 జాతీయ అత్యవసర పరిస్థితిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ శనివారం ప్రకటించారు. అంతే కాకుండా ఏప్రిల్ 27 నుంచి పిల్లలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23 లక్షలు దాటగా, అందులో 11 లక్షల కేసులు యూరోపియన్‌ దేశాల్లో నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి ప్రపంచవ్యాప్తంగా  5,18,900 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు 39 వేల మందికిపైగా కరోనా బారినపడి మృతిచెందగా, ఇటలీలో 23 వేలు, ఫ్రాన్స్‌లో 19 వేలు, బ్రిటన్‌లో 15 వేలమంది మృత్యువాతపడ్డారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని