కరోనా పరీక్షలకు మరో రెండు లక్షణాలు

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను చేసేందుకు ప్రస్తుతం పరిగణిస్తున్న 13 చిహ్నాల జాబితాలోకి మరో రెండు అంశాలు...

Updated : 11 Jun 2020 13:57 IST

జాబితాలో చేర్చేందుకు యోచిస్తున్న ప్రభుత్వం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను చేసేందుకు ప్రస్తుతం పరిగణిస్తున్న 13 లక్షణాల జాబితాలోకి మరో రెండు అంశాలను చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పలు కొవిడ్‌-19 బాధితులలో వాసన చూసే శక్తిని, రుచి చూసే శక్తిని కోల్పోవటం అనే రెండు లక్షణాలు ప్రస్ఫుటమవుతున్నాయి. దీనితో సదరు లక్షణాలను కూడా కరోనా పరీక్షలు జరిపేందుకు ఆధారంగా తీసుకునే అంశం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశీలనలో ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతున్న వైద్య గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాగా, రుచి, వాసన కోల్పోవటాన్ని కొవిడ్‌ ముఖ్య లక్షణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో సహా అనేక ప్రపంచ దేశాలు ఏప్రిల్‌లోనే గుర్తించాయి.

ఈ లక్షణాలుంటే కరోనా పరీక్షలు...

భారత్‌లో కొవిడ్‌ పరీక్షలకు ఆధారంగా తీసుకోవాల్సిన 11 లక్షణాలను తొలిసారిగా జనవరిలో ప్రకటించారు. కాగా ఉదర సంబంధ సమస్యలైన డయేరియా (విరేచనాలు), వాంతులను కూడా అనంతరం వాటిలో చేర్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న నియమాల ప్రకారం దేశంలో... జ్వరం, దగ్గు, డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, ఊపిరి అందకపోవటం, వికారంగా ఉండటం, రక్తంతో కూడిన దగ్గు, ఒంటినొప్పులు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, ముక్కు కారటం, కఫం వంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలున్న వారికి మాత్రమే కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు అనుమతిస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 2,86,579 కేసులు, 8102 మరణాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్యలో భారత్‌ అంతర్జాతీయంగా నాలుగో స్థానానికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో లక్షణాల సంఖ్యను పెంచటం... కరోనా కేసులను పసికట్టి, నిరోధక చర్యలు తీసుకొనేందుకు మరింత ఉపయోగకరమవుతుందని దేశంలోని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, విపరీతమైన నీరసం, కండరాల నొప్పులు, చలిగా ఉండటం వంటి లక్షణాలను కూడా ఆ జాబితాలో చేర్చాలని మరి కొంతమంది వైద్య సిబ్బంది భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని