Supreme Court: కిడ్నీ దానం కోసం బెయిల్‌ ఇవ్వొచ్చు

మాదక ద్రవ్యాల కేసులో జైల్లో ఉన్న నిందితుడు ఒకరు తన తండ్రికి మూత్రపిండం దానం చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. 

Updated : 18 Oct 2021 11:44 IST

 మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు సుప్రీం సూచన 

దిల్లీ: మాదక ద్రవ్యాల కేసులో జైల్లో ఉన్న నిందితుడు ఒకరు తన తండ్రికి మూత్రపిండం దానం చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. మూత్రపిండం దానం చేయడానికి ఆరోగ్యకరంగా ఉన్నాడని వైద్యుల బృందం భావిస్తే తాత్కాలిక బెయిల్‌ కోసం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు సానుభూతితో పరిశీలించాలని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. తొలుత నిందితునికి బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నేరం తీవ్రత దృష్ట్యా బెయిల్‌ ఇవ్వకూడదని ప్రభుత్వం కూడా వాదించింది. అనారోగ్యానికి గురయిన తండ్రిని చూసుకోవడానికి ఇతర సోదరులు, బంధువులు ఉన్నారని తెలిపింది. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘తండ్రిని చూసుకోవడం వేరు..మూత్రపిండాన్ని దానం చేయడం వేరు.. కిడ్నీ ఇవ్వడానికి ఇతర కుమారులు, వారి భార్యలు, పిల్లలు అంగీకరించకపోవచ్చు. దానం చేయడానికి నిందితుడు ముందుకు వస్తున్నందున అందుకోసం ఆయనకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది’’ అని తెలిపింది. ఆయనపై ఉన్న కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. 

భద్రత దళాలకు ఆర్టీఐ వర్తిస్తుందా?

నిఘా, భద్రత దళాలకు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) వర్తిస్తుందో లేదో ఎనిమిది వారాల్లో నిర్ణయించాలని సుప్రీంకోర్టు.. దిల్లీ హైకోర్టుకు సూచించింది. ఒక ఉద్యోగి సీనియారిటీ, ఇంతవరకు లభించిన పదోన్నతులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. తొలుత ఆ విభాగాలు స.హ.చట్టం పరిధిలోకి వస్తాయో, రావో అన్న విషయాన్ని నిర్ధరించిన తరువాతే తదుపరి అంశాలపై ఆదేశాలు ఇవ్వాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. స.హ.చట్టం తమకు వర్తించదంటూ ఆ విభాగాలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపింది. సీనియారిటీ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని భావించిన ఆ విభాగాల ఉద్యోగి ఒకరు ఆర్టీఐ ప్రకారం సమాచారం అడిగారు. అందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిని 15 రోజుల్లోగా ఆయనకు అందించాలంటూ 2018లో హైకోర్టు ఆదేశించింది. నిఘా సంస్థలు ఆర్టీఐ పరిధిలోకి రావన్న కేంద్రం వాదన ఈ సందర్భంలో వర్తించదని తెలిపింది. సొంత ఉద్యోగికే సమాచారం ఇస్తున్నారని, దీనివల్ల ఆ విభాగం భద్రతకుగానీ, రహస్య కార్యకలాపాలకుగానీ ఎలాంటి నష్టం లేదని పేర్కొంది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.

హైకోర్టు జడ్జీల నియామక వ్యవహారం.. పునఃప్రతిపాదనలపై కేంద్రం మౌనం

హైకోర్టు జడ్జీలుగా కొందర్ని నియమించే విషయమై సుప్రీంకోర్టు కొలీజియం పలుమార్లు సిఫార్సులు చేస్తున్నా కేంద్రం మాత్రం వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మార్చి-సెప్టెంబరు నెలల మధ్య నాలుగు హైకోర్టులకు సంబంధించి 12 మంది పేర్లును పునఃప్రతిపాదన చేసినా వాటిపై స్పందించలేదు. కలకత్తా హైకోర్టుకు చెందిన అయిదు పేర్లు, జమ్మూ-కశ్మీర్‌ హైకోర్టుకు చెందిన మూడు, కర్ణాటక, అలహాబాద్‌ హైకోర్టులకు చెందిన రెండేసి పేర్లు ఈ విధంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పేర్లను పునఃపరిశీలించాలంటూ వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కొలీజియానికి తిప్పి పంపించింది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కొలీజియం మాత్రం వారి పేర్లనే మరోసారి సిఫార్సు చేసింది. విధివిధానాల ప్రకారం.. జడ్జీల పదవులకు ఎంపిక చేయదలచిన వారి పేర్లను తొలుత హైకోర్టు కొలీజియంలు ప్రతిపాదించి జాబితాను కేంద్ర న్యాయశాఖకు పంపిస్తాయి. హైకోర్టు ఇచ్చిన జాబితాకు, ఈ నివేదికలను జత చేసి న్యాయశాఖ సుప్రీంకోర్టు కొలీజియానికి పంపిస్తుంది. వీటన్నింటినీ పరిశీలించిన తరువాత ఎంపిక చేసిన పేర్లతో కూడిన జాబితాను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపిస్తుంది. హైకోర్టు కొలీజియంలు 2 నుంచి నాలుగేళ్ల క్రితమే పంపించిన పేర్లపైనా కేంద్రం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని