Netaji: నేతాజీ చితాభస్మం తెద్దామనుకున్న పీవీ ప్రభుత్వం

 ‘స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చితా భస్మాన్ని మన దేశానికి తీసుకురావాలని పీవీ 

Published : 23 Oct 2021 10:40 IST

నిఘా వర్గాల హెచ్చరికతో వెనక్కు తగ్గింది

సుభాష్‌ చంద్రబోస్‌ బంధువు వెల్లడి

కోల్‌కతా: ‘స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చితా భస్మాన్ని మన దేశానికి తీసుకురావాలని పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయించింది. జపాన్‌లోని బౌద్ధ ఆలయంలో భద్రపరిచిన అస్థికల పాత్రను తరలించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, నిఘా వర్గాల హెచ్చరికతో పీవీ ప్రభుత్వం చివరి నిమిషంలో ఆ యోచనను విరమించుకుంది’ అని నేతాజీ బంధువు ఆశిష్‌ రే వెల్లడించారు. ఆ చితా భస్మాన్ని మన దేశానికి తీసుకువస్తే కోల్‌కతాలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించడమే పీవీ ప్రభుత్వ వెనకడుగుకు కారణమని పేర్కొన్నారు. నేతాజీ చితాభస్మం నింపిన పాత్ర 1945 సెప్టెంబరు నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉందని, ఇప్పటికైనా దానిని తీసుకురావాలని పరిశోధకుడు, రచయిత అయిన ఆశిష్‌ రే అభిప్రాయపడ్డారు. నేతాజీ అస్థికలపై ఆయన కుమార్తె ప్రొఫెసర్‌ అనితా బోస్‌కే సర్వాధికారాలు ఉంటాయని తెలిపారు. ఆర్థికవేత్త అయిన ఆమె ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. చితాభస్మం పాత్రను తీసుకునేందుకు అనితా బోస్‌ను ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ 78వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన వర్చువల్‌ సెమినార్‌లో ఆశిష్‌ రే ప్రసంగించారు. 1945 ఆగస్టు 18న తైపైలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోలేదని ఇప్పటికీ కొందరు విశ్వసిస్తున్నారని, ఆయన భారత్‌కు తిరిగి వచ్చి సాధువుగా జీవిస్తున్నారని మరికొందరు అంటున్నారని చెప్పారు. అసలు విమాన ప్రమాదమే జరగలేదని, సోవియట్‌ రష్యా జైలులో నేతాజీని బంధించారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి భిన్న వాదనల మధ్య చితాభస్మాన్ని మన దేశానికి తీసుకొస్తే వారి మనోభావాలు దెబ్బతిని అల్లర్లకు కారణం కావచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని