సంక్షేమ లబ్ధిదారులందరి వివరాలు ఒకేచోట!

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరి కుటుంబాల వివరాలతో ఒక ఉమ్మడి సమాచార నిధిని రూపొందించే 

Published : 02 Dec 2021 12:03 IST

ఉమ్మడి సమాచార నిధి తయారీకి యత్నం
లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరి కుటుంబాల వివరాలతో ఒక ఉమ్మడి సమాచార నిధిని రూపొందించే యత్నం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల ఆయా పథకాల నిర్వహణ సులభంగా ఉంటుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభకు తెలిపారు. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నందున ఆయా కుటుంబాలకు సంబంధించి కచ్చితమైన సమాచారమంతా ఒకే చోట ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు అవి అమలుచేస్తున్న పథకాల లబ్ధిదారుల కుటుంబాల వివరాలతో సమాచార నిధిని రూపొందిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి సమాచార నిధి రూపకల్పనను జులై నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అయితే, జాతీయ సామాజిక పట్టిక(నేషనల్‌ సోషల్‌ రిజిస్ట్రీ) రూపొందించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్దలేదని ఆయన స్పష్టం చేశారు.పౌరులందరి వ్యక్తిగత వివరాలను రాజ్యమే ఒక చోటకు చేర్చితే అది కుల, మత, జాతి ఆధారిత వివక్షాపూరిత చర్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని పుట్టుస్వామి వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి తెలుసునని వెల్లడించారు. సమాచార భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.

జేసీపీ నివేదిక సమర్పణ గడువు పొడిగింపు

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేసీపీ) నివేదిక సమర్పించే గడువును మరోసారి పొడిగించారు. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాలు ముగిసే చివరి వారంలో నివేదిక సమర్పించేందుకు కమిటీకి అనుమతి లభించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని