Amitshah: అత్యంత వేగంగా దేశ ఆర్థిక ప్రగతి: అమిత్‌షా

కరోనా ప్రభావం నుంచి బయటపడి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా

Published : 05 Dec 2021 10:57 IST

మోదీ విధానాలే కారణం: కేంద్రం హోం మంత్రి వ్యాఖ్య 

దిల్లీ: కరోనా ప్రభావం నుంచి బయటపడి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపర నిర్ణయాలే ఇందుకు కారణమని చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ నాయకత్వ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. కరోనా కారణంగా ఆర్థిక రంగం మందగిస్తుందని ముందే అంచనా వేసిన ప్రధాని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ద్రవ్యలోటుపై క్రమశిక్షణ పాటిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత పరిస్థితిని ఆర్థిక పండితులు విశ్లేషించాల్సి ఉందని అన్నారు. మానవీయ కోణంతో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో వృద్ధి సాధిస్తున్నట్టు చెప్పారు. ‘‘రక్షిత మంచినీరు, వంట గ్యాస్‌ పంపిణీ, 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం కారణంగా జీడీపీ అభివృద్ధి చెందదా?’’ అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించిన ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించారని అన్నారు. ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రపంచంలో మరొకరు లేరని చెప్పారు. 

అమరీందర్‌ సింగ్‌తో పొత్తు చర్చలు

అనంతరం సదస్సులో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...పంజాబ్‌లో ఎన్నికల పొత్తు విషయమై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో చర్చలు జరుపుతున్నట్టు అమిత్‌ షా వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్‌ మాజీ నాయకుడు సుఖదేవ్‌ సింగ్‌ దిండ్సాతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందున రైతుల ఆందోళన ఎన్నికలపై ప్రభావం చూపబోదని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘన విజయం సాధించి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పారు. 

రాజస్థాన్‌కు రాక

ఈనాడు, జైపుర్‌: రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటన నిమిత్తం అమిత్‌ షా శనివారం జైసల్మేర్‌ చేరుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగే బీఎస్‌ఎఫ్‌ 57వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జైపుర్‌లో జరిగే భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని