పరస్పర అంగీకారంతో కలయిక తర్వాత పెళ్లికి నిరాకరిస్తే మోసం కాదు:బాంబే హైకోర్టు

పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడం మోసం కాదని బాంబే హైకోర్టు తెలిపింది.

Updated : 24 Dec 2021 12:18 IST

ముంబయి: పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుని.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడం మోసం కాదని బాంబే హైకోర్టు తెలిపింది. ఓ కేసులో 25 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. పెళ్లి హామీతోనే తనతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఆ మహిళ అంగీకరించిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. పెళ్లికి నిరాకరించడమనేది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 417 కింద నేరం కాదని స్పష్టం చేసింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహారాష్ట్ర పాల్గడ్‌కు చెందిన ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడని, వివాహానికి మాత్రం నిరాకరించాడని 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఐపీసీ 376(అత్యాచారం),ఐపీసీ 417(మోసం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో బాధిత మహిళ సహా ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులను ప్రాసిక్యూషన్‌ విచారించింది. మూడేళ్ల విచారణ తర్వాత.. ఈ కేసులో పాల్గఢ్‌ అదనపు న్యాయమూర్తి... నిందితునికి ఏడాది జైలుశిక్ష, రూ.5,000 జరిమానా విధించారు. దీంతో నిందితుడు బాంబే హైకోర్టులో అప్పీలు చేశాడు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వాళ్లిద్దరూ పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధం పెట్టుకున్నారని సాక్ష్యాధారాలు ఉన్నాయని, అదే సమయంలో వివాహం చేసుకునే ఉద్దేశం నిందితుడికి ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని