Supreme Court: ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు

ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించింది.

Updated : 16 Dec 2022 10:17 IST

బలమైన ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోవచ్చు
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు

దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించింది. ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించవచ్చని స్పష్టం చేసింది. అవినీతి జరిగిందన్నదానికి ఆధారంగా ఉన్న ఇతరత్రా బలమైన ప్రాసంగిక సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకొని లంచాలు తీసుకున్న అధికారులను దోషులుగా తీర్మానించవచ్చని తెలిపింది. ఇందుకు ఫిర్యాదుదారులతో పాటు.. ప్రాసిక్యూషన్‌ కూడా చిత్తశుద్ధితో, నిజాయతీతో కృషి చేసి, లంచావతారుల కారణంగా పరిపాలన, ప్రభుత్వం భ్రష్టు పట్టకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల (జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న) రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

‘‘ఫిర్యాదుదారుడు ఎదురుతిరిగినప్పుడు లేదా చనిపోయినప్పుడు లేదా విచారణ సమయంలో తన సాక్ష్యాన్ని నమోదు చేయలేనప్పుడు.. ఇతర సాక్షుల మౌఖిక లేదా డాక్యుమెంటరీ లేదా సందోర్భోచిత సాక్ష్యాల ఆధారంగా అక్రమ ప్రతిఫలాన్ని ప్రభుత్వ ఉద్యోగి డిమాండు చేసినట్లు నిరూపించవచ్చు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. లంచం స్వీకరించిన ప్రభుత్వ ఉద్యోగికి వ్యతిరేకంగా ప్రత్యక్ష లేదా ప్రాథమిక సాక్ష్యం లేనప్పుడు, ఇతర సాక్ష్యాలు ఆధారంగా దోషిగా తీర్మానించవచ్చా అన్న అంశాన్ని తేల్చడానికి ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని