వీఈఎల్‌సీ పేలోడ్‌ సిద్ధం

సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించనున్న ‘ఆదిత్య ఎల్‌1’ వ్యోమనౌకలో ఉపయోగించే ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)’ అనే కీలక పేలోడ్‌ సిద్ధమైంది.

Published : 27 Jan 2023 04:23 IST

ఇస్రో ఛైర్మన్‌కు అందజేసిన ఐఐఏ
జూన్‌లో లేదా జులైలో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం

ఈనాడు, బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించనున్న ‘ఆదిత్య ఎల్‌1’ వ్యోమనౌకలో ఉపయోగించే ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)’ అనే కీలక పేలోడ్‌ సిద్ధమైంది. భారత ఖగోళ- భౌతికశాస్త్ర సంస్థ (ఐఐఏ) డైరెక్టర్‌ అన్నపూర్ణి సుబ్రమణియం, వీఈఎల్‌సీ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ ఈ పేలోడ్‌ను ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌కు బెంగళూరు పరిసరాల్లోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (క్రెస్ట్‌) ప్రాంగణంలో గురువారం అందజేశారు. అనంతరం సోమనాథ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్‌లోగానీ జులైలోగానీ ఆదిత్య ఎల్‌1ను ప్రయోగిస్తామని తెలిపారు. వీఈఎల్‌సీ రూపకల్పనను ఐఐఏ చరిత్రలో అరుదైన మైలురాయిగా అన్నపూర్ణి సుబ్రమణియం అభివర్ణించారు. ఐఐఏలో భాగమైన కొడైకెనాల్‌ సోలార్‌ అబ్జర్వేటరీలో పనిచేసిన బ్రిటిష్‌-భారతీయ వ్యోమగాములు 125 ఏళ్ల కిందట తీసిన సూర్యగోళ చిత్రాన్ని వీఈఎల్‌సీ తయారీలో లాంఛనంగా ఉపయోగించినట్లు ఆచార్య రాఘవేంద్ర ప్రసాద్‌ తెలిపారు. యూఆర్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ఎం.శంకరన్‌, ఆదిత్య ఎల్‌1 ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ నిగార్‌ షాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీఈఎల్‌సీ ప్రత్యేకతలివీ..: సూర్యుడి వాతావరణంలో కొన్ని లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. దాని ఉపరితలంపై మాత్రం ఉష్ణోగ్రత 6వేల కెల్విన్‌ మాత్రమే ఉంటుంది. ఈ రహస్యాన్ని ఛేదించడంలో వీఈఎల్‌సీ కీలకంగా మారే అవకాశముంది. దీని బరువు 90 కిలోలు. ఇందులోని నానో స్కానర్లు, టీసీ డిటెక్టర్లు, 40 ఆప్టికల్‌ కెమేరాలు మేలైన పిక్సల్‌ రిజల్యూషన్‌తో చిత్రాలు తీయగలవు. ఉపరితలం నుంచి వచ్చే కాంతిని వేరు చేసి తదుపరి అధ్యయనాలకు ప్రాసెస్‌ చేయగలగడం మరో విశిష్టత. సూర్యుడి ఉష్ణోగ్రత, వేగం, సాంద్రత, గాలి త్వరణం, అయస్కాంత క్షేత్రాలను అది కొలుస్తుంది. ఈ పేలోడ్‌ను క్రెస్ట్‌ ప్రాంగణం నుంచి త్వరలోనే శ్రీహరికోటకు తరలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని