అమ్మ నుంచి సమయ పాలనను నేర్చుకోండి

చేతిలో ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రతి విద్యార్థి ఇంట్లో అమ్మను చూసి నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

Published : 28 Jan 2023 05:41 IST

విద్యార్థులకు ప్రధాని పిలుపు
పరీక్షాపే చర్చ కార్యక్రమంలో మాటామంతి

ఈనాడు, దిల్లీ: చేతిలో ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రతి విద్యార్థి ఇంట్లో అమ్మను చూసి నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6వ పరీక్షాపే చర్చ కార్యక్రమంలో భాగంగా ఆయన బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులతో ముచ్చటించారు. శుక్రవారం ఇక్కడి తల్కతోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మార్గనిర్దేశం చేశారు. అవి...

సమయ విభజనతో కచ్చిత ఫలితం

మీరు ఎప్పుడైనా ఇంట్లో అమ్మచేసే పనులను గమనించారా? పిల్లలు స్కూలుకు, ఇతరులు బయటికి వెళ్లేటప్పటికి తాను ఏమేం చేయాలన్నది అమ్మకు బాగా తెలుసు. సమయ నిర్వహణ(టైం మేనేజ్‌మెంట్‌)తో ఏయే పనులు ఎప్పటిలోగా చేయాలన్నది తనకు బాగా తెలుసు. అందువల్ల పిల్లలందరూ ఇంట్లో అమ్మ చేసే పనులను పరీక్షగా గమనిస్తే సమయం మహత్యం ఏంటన్నది తెలుస్తుంది. అలా ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలన్నది అర్థం చేసుకుని విద్యార్థులు తమ సమయాన్ని విభజించుకోవాలి. దానివల్ల మీకు కచ్చితంగా ఫలితం వస్తుంది.

కష్టమైన విషయానికి 30 నిమిషాలు

కేవలం పరీక్ష సమయంలోనే కాకుండా జీవితాంతం మనకు టైం మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం. ఎక్కడ సమయం వృథా అవుతోందో ఒక వారం రోజులపాటు డైరీలో రాసుకోండి. అందులో మీకు ఇష్టమైన దానికి ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలుస్తుంది. అలా కాకుండా మీకు పెద్దగా ఇష్టం లేని, అత్యంత కష్టమైన అంశానికి తొలి 30 నిమిషాలు కేటాయించండి. తర్వాత ఇష్టమైన విషయానికి 20 నిమిషాలు ఇవ్వండి. ఇలా స్లాబ్‌ తయారు చేసుకొని చదువుకుంటూపోతే మీకు ఒత్తిడి తొలగి అన్ని సమస్యలూ తీరిపోతాయి.

అలా చదివితే జీవితం రంగులమయం

ఇదివరకు బయటికి తెలియకుండా కాపీ కొట్టేవాళ్లు... ఇప్పుడు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆలోచల్లో వచ్చిన ఈ మార్పు చాలా ప్రమాదకరం. అందువల్ల సమాజం మొత్తం దీని గురించి ఆలోచించాలి. కాపీ కొట్టి పరీక్షపాసైనవారు జీవితంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కోలేరు. కష్టపడి చదివేవారికి ఎప్పటికీ జీవితం రంగులమయంగా ఉంటుంది. అందువల్ల ఎవ్వరూ కాపీ గురించి ఆలోచించొద్దు.

అసాధారణంగా పనిచేస్తేనే..

పిల్లలు తమ శక్తిసామర్థ్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిని గుర్తిస్తే చాలు ఆరోజు నుంచి మనం అత్యంత శక్తిమంతులం కాగలం. తల్లిదండ్రులూ తమ పిల్లల బలాబలాలను సరిగా అంచనా వేయాలి. వారిలో ఆత్మన్యూనత భావన రానీయకూడదు.  ప్రపంచంలో అత్యధికమంది సాధారణ స్థాయివారే ఉంటారు. వారు అసాధారణ రీతిలో పనిచేసినప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.

ఆ లక్షణానికి సానపెడితే ముందుకే

రెండు మూడేళ్ల క్రితం మన దేశాన్ని చాలా యావరేజ్‌గా చూసేవారు. ప్రధానమంత్రిక్కూడా ఆర్థిక జ్ఞానం లేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు మనదేశమే ప్రపంచస్థాయిలో మెరుస్తోంది. అందువల్ల మనం ఎంత యావరేజ్‌గా ఉన్నప్పటికీ మనలో ఏదో ఒకటి అసాధారణమైన లక్షణం ఉంటుంది. దాన్ని గుర్తించి సానపెడితే ముందుకెళ్తాం.

ఫలితం ఎలా ఉన్నా ముందడుగు

రాత్రింబవళ్లు పోటీ వాతావరణంలో జీవించడం ఆందోళనకు కారణం. మనం మన చుట్టూ ఉన్న వారి నుంచి నేర్చుకుంటూ మన కోసం, మనలో మనం జీవిస్తే.. ఫలితం ఎలా వచ్చినా జీవితంలో ముందడుగు వేయగలనన్న నమ్మకంతో ఉంటే ఆందోళన మన దరిదాపులకురాదు.

సాంకేతిక లంఖణం పాటించాలి

పిల్లలు తమ కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మనదేశంలో ప్రజలు సగటున ఆరు గంటలు ఫోన్‌ స్క్రీన్‌పై ఉంటున్నట్లు తెలుస్తోంది. మన సృజనాత్మక వయస్సు, సామర్థ్యం సగటున ఆరు గంటలు ఫోన్‌ చూడటానికే పరిమితం కావడం ఆందోళనకరం. కొన్ని గంటలపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలను పక్కన పెట్టాలి(సాంకేతిక లంఖణం పాటించాలి). ఇంట్లో ఒక భాగాన్ని నో టెక్నాలజీ జోన్‌గా ప్రకటించి అక్కడ అంతా కూర్చొని మాట్లాడుకోవాలి. అలాచేస్తే జీవనంలో ఆనందం తెలిసి వస్తుంది. అప్పుడు ఎవరికి వారు మొబైల్‌ను పక్కన పెట్టేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు