పిటిషనర్‌ లౌకికవాది అయి ఉండాలి

మతపరమైన అర్థాలున్న రాజకీయ పార్టీలను, వాటి చిహ్నాలను నిషేధించాలన్న పిటిషనర్‌ తప్పనిసరిగా లౌకికవాది అయి ఉండాలనీ, అందరి దృష్టిలో నిష్పక్షపాత వ్యక్తిగా నిలవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 01 Feb 2023 06:34 IST

ఎంపిక చేసుకున్నవారిని లక్ష్యంగా పెట్టుకోకూడదు
పిల్‌పై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: మతపరమైన అర్థాలున్న రాజకీయ పార్టీలను, వాటి చిహ్నాలను నిషేధించాలన్న పిటిషనర్‌ తప్పనిసరిగా లౌకికవాది అయి ఉండాలనీ, అందరి దృష్టిలో నిష్పక్షపాత వ్యక్తిగా నిలవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సయ్యద్‌ వసీం రిజ్వి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్న మంగళవారం విచారణ జరిపారు. పిల్‌ను వ్యతిరేకిస్తూ మజ్లిస్‌ (ఏఐఎంఐఎం), ఇండియన్‌ యూనియన్‌ ఆఫ్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముస్లిం పేర్లున్న ఈ రెండు పార్టీలనే పిటిషనర్‌ ఇంప్లీడ్‌ చేశారనీ, ఇతర మతాల ప్రస్తావన ఉన్న పార్టీలను వదిలేశారని వారు పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ వ్యాఖ్యలు చేశారు. పిటిషన్‌ను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు తీసుకువెళ్లాలా వద్దా అనేది పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. అంతకుముందు మజ్లిస్‌ పార్టీ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. అనేక క్రిమినల్‌ కేసుల్ని ఎదుర్కొంటూ బెయిల్‌పై విడుదలైన విషయాన్ని, నేరాభియోగాలను పిటిషనర్‌ దాచిపెట్టారని చెప్పారు. ముస్లిం వ్యక్తి పేరుతో పిటిషన్‌ దాఖలైనా ఆయన హిందూమతంలోకి మారి జితేంద్ర నారాయణ్‌ సింగ్‌ త్యాగి అనే పేరు పెట్టుకున్నారని, ఈ ఒక్క కారణంతో పిటిషన్‌ను కొట్టివేయవచ్చని చెప్పారు. ఈ పిటిషన్‌పై ఏ ఉత్తర్వు ఇచ్చినా దేశ ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం ప్రభావితం అవుతుందన్నారు. శివసేన, హిందూ జాగరణ్‌ మంచ్‌, శిరోమణి అకాలీదళ్‌ వంటి ఇతర పార్టీలను పిటిషనర్‌ చేర్చలేదని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే చెప్పారు. తదుపరి విచారణను మార్చి 20న చేపడతామని ధర్మాసనం ప్రకటించింది.

ఆ మూడింటిపై వేర్వేరుగా విచారణ

ఎన్నికల బాండ్ల పథకం, రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం, విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణలు.. ఈ మూడు అంశాలపై వేర్వేరుగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల మీద విడివిడిగా విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు