వెంకయ్య నాయుడి ఇంట నూతన సంవత్సరాది వేడుకలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసంలో సోమవారం సాయంత్రం నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 22న వచ్చే తెలుగువారి శోభకృత్‌నామ ఉగాది పండగతోపాటు తమిళ, కన్నడ, మలయాళీల కోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవాలను ఆయన నిర్వహించారు.

Published : 21 Mar 2023 05:36 IST

 హాజరైన ప్రధాని, ఉపరాష్ట్రపతి, స్పీకరు
మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తదితరులూ..
ఉగాదితోపాటు కన్నడ, తమిళ, మలయాళ పండగల సంబరం  

ఈనాడు, దిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసంలో సోమవారం సాయంత్రం నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 22న వచ్చే తెలుగువారి శోభకృత్‌నామ ఉగాది పండగతోపాటు తమిళ, కన్నడ, మలయాళీల కోసం ప్రత్యేకంగా ఈ ఉత్సవాలను ఆయన నిర్వహించారు. దిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా, రాజ్యసభ వైస్‌ ఛైర్మన్‌ హరివంశ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, హరియాణా గవర్నరు బండారు దత్తాత్రేయ, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నరు వీకే సక్సేనా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, జి.కిషన్‌రెడ్డి, మరికొంత మంది మంత్రులు, వైకాపా, తెదేపా ఎంపీలు, దక్షిణాదితోపాటు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన విభిన్న పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొని పంచాంగ శ్రవణం, సంప్రదాయ నృత్యాలను తిలకించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరూ కలిసే ఇలాంటి అవకాశాల కోసం వెంకయ్య నాయుడు వెతుకుతూ ఉంటారు. చాలా రోజుల నుంచి ఆయనకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఆయన ప్రతి విషయంలోనూ ఆనందం పొందుతుంటారు. అందరితో కలిసి భోజనం చేయడం, చేయించడం ఆయనకు ఎంతో పసందైన పని. ఈ రోజు నాకు వారి కుటుంబ సభ్యులందరిని కలిసే అవకాశం వచ్చింది. దేశ ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని