మనిషికి సోకిన ‘వృక్ష శిలీంధ్రం’!

సాధారణంగా వృక్షజాతుల్లో వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంధ్రం తొలిసారి మనదేశంలో ఓ వ్యక్తికి సోకింది. ప్రపంచంలోనే ఈ తరహా కేసు ఇదే కావడం గమనార్హం.

Updated : 01 Apr 2023 07:25 IST

ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో నమోదు

కోల్‌కతా: సాధారణంగా వృక్షజాతుల్లో వ్యాధికి కారణమయ్యే ఓ శిలీంధ్రం తొలిసారి మనదేశంలో ఓ వ్యక్తికి సోకింది. ప్రపంచంలోనే ఈ తరహా కేసు ఇదే కావడం గమనార్హం. వృక్షాల్లో ‘సిల్వర్‌ లీఫ్‌’ వ్యాధికి కారణమయ్యే ‘కొండ్రోస్టీరియం పోర్పోరియమ్‌’ అనే శిలీంధ్రం.. కోల్‌కతాకు చెందిన వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై పని చేసే ఓ పరిశోధకుడికి సోకింది. బాధితుడికి చికిత్స అందజేసిన వైద్యులు ఈ కేసుపై రూపొందించిన ఓ నివేదిక.. ‘మెడికల్‌ మైకాలజీ కేస్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ‘గొంతు బొంగురుపోవడం, దగ్గు, ఆయసం, ఆహారం మింగడానికి ఇబ్బంది, ఆకలి మందగించడం వంటి లక్షణాలు బాధితుడి(61)లో కనిపించాయి. ఆయనకు మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, గాయాలు వంటివి ఏం లేవు. వృత్తిపరంగా ఆయన వృక్షసంబంధిత మైకాలజిస్ట్‌. కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై ఏళ్లుగా పరిశోధన సాగిస్తున్నారు. కుళ్లిపోతున్న పదార్థాలతో పని చేయడమే ఈ అరుదైన సంక్రమణకు కారణం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ స్వభావం, వ్యాప్తి చెందగల సామర్థ్యం మొదలైనవి నిర్ధారితం కాలేదు’ అని నివేదికలో పేర్కొన్నారు.‘బాధితుడి మెడ వద్ద కణితిని గుర్తించి.. శస్త్రచికిత్స ద్వారా తొలగించాం. అనంతరం తీసిన ‘ఎక్స్‌-రే’లో అసాధారణంగా ఏమీ కనిపించలేదు. ఆయన ‘యాంటీ-ఫంగల్‌’ ఔషధాలు తీసుకున్నారు. ఇది జరిగి రెండేళ్లవుతోంది. ఆయన ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఆ వ్యాధి పునరావృతం అవుతుందనేందుకు కూడా ఆధారాల్లేవు. అయితే, సంప్రదాయ పరీక్ష విధానాలు(మైక్రోస్కోపీ, కల్చర్‌) బాధితుడిలో ఫంగస్‌ ఆనవాళ్లను గుర్తించలేకపోయాయి. ప్రస్తుతానికి సీక్వెన్సింగ్‌ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధి కారకాన్ని గుర్తించొచ్చు. వృక్షసంబంధిత శిలీంధ్రాల ద్వారా మనుషులకు వ్యాధి సోకే అవకాశాలు, వాటిని గుర్తించే విధానాల ఆవశ్యకతను ఈ కేసు చాటిచెబుతోంది’ అని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని