కంది, మినప్పప్పు నిల్వలపై పరిమితులు

కంది, మినప్పప్పు నిల్వలపై కేంద్రం పరిమితులు విధించింది.

Published : 03 Jun 2023 04:43 IST

ఈనాడు, దిల్లీ: కంది, మినప్పప్పు నిల్వలపై కేంద్రం పరిమితులు విధించింది. టోకు వర్తకులు 200 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్లు 5 మెట్రిక్‌ టన్నులు, ప్రతి రిటైల్‌ అవుట్‌లెట్‌లో 5 మెట్రిక్‌ టన్నులు, బిగ్‌ చెయిన్‌ రిటైలర్లు డిపోల్లో 200 మెట్రిక్‌ టన్నులకు మించి ఇందులో ఒక్కో పప్పు నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వచ్చి అక్టోబర్‌ 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. మిల్లర్లు చివరి మూడు నెలల ఉత్పత్తి లేదా వార్షిక మిల్లింగ్‌ సామర్థ్యంలో 25% ఏది ఎక్కువైతే అంతవరకూ నిల్వ ఉంచుకోవచ్చని పేర్కొంది. దిగుమతిదారులు కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వచ్చిన 30 రోజులకు మించి దిగుమతి చేసుకున్న సరకును నిల్వ ఉంచడానికి వీల్లేదని తెలిపింది. అన్ని వ్యాపార సంస్థలూ తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదుచేయాలని సూచించింది. ఒకవేళ ప్రస్తుతం విధించిన పరిమితులకు మించి ఎవరిదగ్గరైనా నిల్వలు ఉంటే ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసిన 30 రోజుల్లోపు పరిమితులకు లోబడి వాటిని తీసుకురావాలని పేర్కొంది. నిత్యావసరాల ధరలను నియంత్రణలో ఉంచడానికే ఈ పరిమితి విధించినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని