Vande Bharat Express: వందేభారత్‌ వేగం గంటకు 220 కి.మీ

రానున్న రెండేళ్లలో వందేభారత్‌ రైళ్ల పరంగా మార్పులు తీసుకురానున్నారు. ‘హై స్పీడ్‌’ రైళ్ల కేటగిరీ వేగాన్ని అందుకునే దిశగా వాటిలో మార్పులు చేయనున్నారు.

Updated : 30 Jul 2023 07:02 IST

రెండేళ్లలో సాధ్యమంటున్న ఐసీఎఫ్‌
కొత్త రైళ్లలో మరిన్ని మార్పులు

రానున్న రెండేళ్లలో వందేభారత్‌ రైళ్ల పరంగా మార్పులు తీసుకురానున్నారు. ‘హై స్పీడ్‌’ రైళ్ల కేటగిరీ వేగాన్ని అందుకునే దిశగా వాటిలో మార్పులు చేయనున్నారు. ఈ మేరకు చెన్నైలోని ఐసీఎఫ్‌ నిపుణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న వందేభారత్‌ రైల్వే కోచ్‌ల సామర్థాన్నిపెంచేందుకు అవసరమైన సాంకేతికతపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

ఈనాడు, చెన్నై

ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు ట్రాక్‌ సామర్థ్యాన్ని బట్టి గంటకు 60 నుంచి 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నాయి. రానున్న రోజుల్లో నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే దిశగా.. వందేభారత్‌ రైళ్ల వేగాన్ని పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో ప్రణాళికలు రచిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 200 నుంచి 220 కి.మీ.కు పెంచాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డుతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ వేగాన్ని అందుకోవాలంటే వందేభారత్‌ రైళ్లలో సామగ్రిపరంగా మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతం ఈ రైళ్లకు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లోహాన్ని వాడుతున్నారు. హైస్పీడ్‌ వేగాన్ని అందుకోవాలంటే అల్యూమినియం లోహంతో వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కార్యరూపం దాల్చడానికి, ప్రొటోటైప్‌ రైలు సిద్ధమవడానికి మరో రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. తర్వాత ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఈ వేగంతో రైళ్లను పరుగులు పెట్టించే అవకాశాలున్నాయి. దీనికి తగ్గట్లు సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ సాంకేతిక మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో గంటకి 245 కి.మీ. వేగాన్ని అందుకునే సామర్థ్యంతో వందేభారత్‌ డిజైనింగ్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. కానీ పట్టాలపై మాత్రం దీని అత్యధిక వేగం గంటకు 220 కి.మీ.కు మించకుండా చేసే అవకాశముందని చెబుతున్నారు.

మూడు రంగులతో ముందుకు

ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు ‘తెలుపు, నీలం’ రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే మరో రెండు రంగుల్లో రానున్నాయి. వాటిలో కాషాయం రంగు ప్రధానంగా, బూడిద రంగు పాక్షికంగా ఉండనుండగా, మరొకటి.. బూడిద రంగు ప్రధానంగా, కాషాయం రంగు పాక్షికంగా ఈ రైళ్లపై కనిపించేలా ప్రణాళికలు చేస్తున్నారు. తొలి విడతలో రెండు కోచ్‌ల్ని, ఒక ఇంజిన్‌ని కషాయం రంగులో ట్రయల్‌ వర్షన్‌ని సిద్ధం చేసి ఉంచారు. ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపారు. ఇప్పటికే 25 వందేభారత్‌ రైళ్లు వివిధ రైల్వే జోన్లకు కేటాయించారు. మరో రెండు సిద్ధంగా ఉన్నాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రేరణగా తీసుకుని 28వ రైలుగా కాషాయ రంగు కోచ్‌ల్ని ఎంపిక చేసినట్లు ఇటీవల చెన్నైకి వచ్చిన రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. ఈ వెర్షన్‌ రైళ్లు కొన్ని తయారైన తర్వాత.. బూడిదరంగుతో మరో వెర్ష్షన్‌ తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా 75 రైళ్లు తిరుగుతూ ఉండాలి. కానీ ఇప్పటికి కేవలం 25 మాత్రమే తిరుగుతున్నాయి. ఇతర రైల్వే ఫ్యాక్టరీల్లో తయారీ మొదలుపెట్టకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వందేభారత్‌ రైలు ప్రస్తుతం ఒక్క ఐసీఎఫ్‌లోనే రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది మార్చికి 77 రైళ్లను తయారుచేసేలా ఐసీఎఫ్‌కు ఆర్డర్లు వచ్చాయి.

ఫిబ్రవరికి ఏసీ స్లీపర్‌  

వందేభారత్‌ను పూర్తిగా ఏసీ స్లీపర్‌గా మార్చే వెర్షన్‌ మరికొన్ని నెలల్లో తయారుకానుంది. ఒక ప్రొటోటైప్‌ (నమూనా) రైలును తయారు చేసేందుకు ఐసీఎఫ్‌లో నెల సమయం పడుతోంది. వచ్చే ఏడాది జనవరిలో పనులు మొదలుపెట్టి ఫిబ్రవరిలో కొత్త వర్షన్‌ను పరిచయం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏసీ స్లీపర్‌లో 1 ఫస్ట్‌ క్లాస్‌, 4 టూ టైర్‌, 11 త్రీ టైర్‌ కోచ్‌లు ఉండేలా డిజైన్‌ చేశారు. దీనికి అనుబంధ ప్రాజెక్టుగా వందేభారత్‌ మెట్రో నమూనా రైలునూ రూపొందించాలని యోచిస్తున్నారు.

25 మార్పులతో కొత్తగా తయారీ

వందేభారత్‌ రైళ్లలో ప్రయాణికులు, రైల్వే నిపుణుల సూచనల మేరకు 25 కీలక మార్పులు చేసినట్లు ఐసీఎఫ్‌ అధికారులు ప్రకటించారు. సీటు వాలులో మార్పులు చేయడంతో పాటు మెత్తదనాన్ని అదనంగా 25శాతం పెంచుతున్నారు. మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్ల అమరిక, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్స్‌లో కాళ్లు పెట్టుకునే స్థలాన్ని పెంచుతున్నారు. మరుగుదొడ్లలో నాణ్యమైన దీపాలు, దివ్యాంగుల కోసం వీల్‌ఛైర్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. కేటరింగ్‌ విభాగంలోనూ ఫిర్యాదులు రావడంలో అందులోనూ మార్పులు వస్తున్నాయి. మరోవైపు వందేభారత్‌ తయారీలో 100శాతం స్వదేశీ సామగ్రి, సాంకేతికత ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 85 శాతం స్వదేశీ ఉత్పత్తులే వాడుతున్నారు. రైలుకు అవసరమైన మోటార్లు, ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లు, చక్రాలు వంటివి విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. రానున్న రోజుల్లో చక్రాలు సైతం స్వదేశానికి వాడేలా ఆర్డర్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. పలు స్టార్టప్‌లు సైతం వందేభారత్‌కు సామగ్రి అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో త్రీడీ ప్రింటింగ్‌ ఉత్పత్తులూ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని