అదిగదిగో జాబిల్లి

కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి వెళ్లిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

Published : 02 Aug 2023 06:02 IST

విజయవంతంగా చంద్రయాన్‌-3 టీఎల్‌ఐ విన్యాసం
5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం

కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి వెళ్లిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఒక్కో దశను అధిగమిస్తూ చందమామ దిశగా అడుగులు వేస్తోంది. 17 రోజుల పాటు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఈ వ్యోమనౌక.. ఇప్పుడు కీలకమైన ‘ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్‌’ (టీఎల్‌ఐ) దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫలితంగా అది భూమికి వీడ్కోలు చెప్పి.. చందమామ దిశగా పయనాన్ని ఆరంభించింది. ఇక జాబిల్లిని చేరుకోవడమే తరవాయి. ఈ నెల 5న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

చంద్రుడిపైన ల్యాండర్‌, రోవర్‌లను దించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జులై 14న ఎల్‌వీఎం3 ఎం-4 రాకెట్‌ సాయంతో చంద్రయాన్‌-3ను భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నాటి నుంచి  శాస్త్రవేత్తలు.. వ్యోమనౌకలోని ఇంజిన్‌ను నిర్దిష్ట సమయంలో మండించడం ద్వారా దశలవారీగా దీని కక్ష్యను పెంచారు. ఈ విధానంలో వ్యోమనౌక భూగురుత్వాకర్షణ శక్తిని యుక్తిగా ఉపయోగించుకుంటూ వడిసెలా (స్లింగ్‌షాట్‌) ముందుకు కదులుతుంది. ఫలితంగా దాని కక్ష్య 1,27,603 కి.మీ ్ల 236 కి.మీ.కి పెరిగింది.

  • మంగళవారం చంద్రయాన్‌-3.. భూమికి చేరువగా ఉండే బిందువు (పెరిజీ)లో ఉన్న సమయంలో శాస్త్రవేత్తలు కీలక కసరత్తు చేపట్టారు. ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఆదేశాలు పంపి వ్యోమనౌకలోని ఇంజిన్‌ను 20 నిమిషాలకుపైగా మండించడం ద్వారా టీఎల్‌ఐ విన్యాసాన్ని నిర్వహించారు. ఫలితంగా ఈ వ్యోమనౌక భూకక్ష్యను వీడి, చందమామను చేరుకునే మార్గం (లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ)లోకి ప్రవేశించింది. ఈ దశలో దాని కక్ష్య  288కి.మ్లీ 3,69,328 కి.మీ.కు పెరిగింది.

తదుపరి ఏమిటి?

లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలో పయనిస్తూ ఈ నెల 5న చందమామకు చంద్రయాన్‌-3 చేరువవుతుంది. ఆ దశలో వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను మరోసారి మండించి, దాన్ని వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా అది చందమామ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. దీన్ని లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ (ఎల్‌వోఐ)గా పేర్కొంటారు.

  • దీంతో చంద్రయాన్‌-3లోని ‘మూన్‌ సెంట్రిక్‌ దశ’ మొదలవుతుంది. ఆ తర్వాత జాబిల్లి చుట్టూ ఈ వ్యోమనౌక తిరుగుతుంది.
  • ఆ దశలో వ్యోమనౌక ఇంజిన్‌ను దశలవారీగా మండించి, దాని కక్ష్యను తగ్గిస్తారు. క్రమంగా చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకొస్తారు. భూకక్ష్య నుంచి వచ్చాక నేరుగా చందమామపై దిగడం ఈ వ్యోమనౌకకు సాధ్యం కాదు కాబట్టి అత్యంత ఒడుపుగా ఈ విన్యాసాలను నిర్వహించడం చాలా కీలకం.
  • ఈ నెల 17న చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌-రోవర్‌ మాడ్యూల్‌.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి వేరవుతుంది.
  • 23న చిట్టచివరి, అత్యంత కీలకమైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆ రోజున ల్యాండర్‌-రోవర్‌ మాడ్యూల్‌కు ఆదేశాలు పంపడం ద్వారా దాన్ని చందమామపై దించుతారు. క్రమపద్ధతిలో వేగాన్ని నియంత్రించుకుంటూ సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో మృదువుగా దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి, చందమామ ఉపరితలంపై తిరుగుతుంది. ఈ రెండూ 14 రోజులపాటు జాబిల్లిపై పరిశోధనలు సాగిస్తాయి.

పెరిజీలోనే ఈ విన్యాసం ఎందుకు?

ఇప్పటి వరకూ చంద్రయాన్‌-3.. భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించింది. ఇందులో పుడమికి దగ్గరగా ఉండే బిందువును ‘పెరిజీ’ అని, దూరంగా ఉండే బిందువును ‘అపోజీ’ అని పిలుస్తారు.

  • పెరిజీ వద్ద ఉన్నప్పుడు చంద్రయాన్‌-3 వేగం అత్యధిక స్థాయి (సెకనుకు 10.3 కిలోమీటర్లు)లో, అపోజీ వద్ద తక్కువగా (సెకనుకు కిలోమీటరు) ఉండేది. 
  • స్లింగ్‌షాట్‌ విన్యాసం చేసేటప్పుడు వ్యోమనౌక గరిష్ఠ వేగంతో కదులుతుండాలి. అందువల్ల పెరిజీ వద్దే దీన్ని నిర్వహిస్తారు.
  • దీనికితోడు వ్యోమనౌక చంద్రుడి దిశగా పయనించాలంటే తన దృక్కోణాన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. పెరిజీ వద్ద టీఎల్‌ఐ విన్యాసాన్ని నిర్వహిస్తే అది సులువుగా సాగుతుంది.
  • తాజా టీఎల్‌ఐ విన్యాసం తర్వాత చంద్రయాన్‌-3 వేగం సెకనుకు సుమారు 0.5 కిలోమీటర్ల మేర పెరిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు