Manish Sisodia: మరింత కాలం జైల్లోనే మనీశ్ సిసోదియా..!

మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియా (Manish Sisodia) బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో మరింతకాలం ఆయన జైల్లోనే ఉండనున్నారు.

Published : 04 Aug 2023 12:43 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Excise policy scam)కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు ఊరట లభించలేదు. ఈడీ (ED), సీబీఐ (CBI) కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వాయిదా వేసింది. దీంతో మరింతకాలం ఆయన జైల్లోనే ఉండనున్నారు.

ఈ కేసుల్లో సిసోదియా (Manish Sisodia) బెయిల్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో భార్య అనారోగ్యం దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్‌ (Interim bail) మంజూరు చేయాలని కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గత నెల విచారణ జరిపిన న్యాయస్థానం.. సిసోదియా మధ్యంతర బెయిల్‌ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఈడీ, సీబీఐని ఆదేశించింది.

‘సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది’.. మీనాక్షి లేఖి వివాదాస్పద వ్యాఖ్యలు

తాజాగా ఈ పిటిషన్లపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సిసోదియా భార్య మెడికల్‌ రికార్డులను పరిశీలించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తేలడంతో.. విచారణను వాయిదా వేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లతో పాటే మధ్యంతర బెయిల్‌ పిటిషన్లను విచారిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు సిసోదియా పిటిషన్‌పై సీబీఐ సుప్రీంకోర్టుకు తమ స్పందన తెలియజేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని ఆరోపించిన సీబీఐ.. సిసోదియాకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది. అటు ఈడీ తమ స్పందన తెలియజేసేందుకు కోర్టు మరింత గడువు కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని