జమిలిపై పార్టీల అభిప్రాయాల సేకరణ

దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.

Published : 24 Sep 2023 04:37 IST

లా కమిషన్‌ నుంచి కూడా
ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీలో నిర్ణయం

ఈనాడు, దిల్లీ: దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కేంద్రం ఈ నెల 2న కమిటీని నియమించిన విషయం తెలిసిందే. శనివారం దిల్లీలో తొలిసారి సమావేశమైన కమిటీ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

విధివిధానాలపై చర్చ

కమిటీ ఛైర్మన్‌ కోవింద్‌ సభ్యులకు స్వాగతం పలికి సమావేశ ఎజెండాను, చేయాల్సిన పనిపై విధి విధానాలనూ వివరించారు. జమిలి ఎన్నికల నిర్వహణపై జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న పార్టీలు, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్రపార్టీలతో పాటు లా కమిషన్‌ నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు కోరుతూ ఆహ్వానం పంపాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి? జమిలి ఎన్నికలపై పరిశోధన.. తదితర అంశాలు చర్చకు వచ్చాయి. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, మాజీ సీవీసీ సంజయ్‌ కొఠారి హాజరయ్యారు. సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. కమిటీ నుంచి వైదొలగుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఇందులో పాల్గొనలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని