Higher pension: అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారం నిలిపివేత

అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం నిలిచిపోయింది.

Updated : 29 Oct 2023 08:14 IST

పింఛను గణనపై కొరవడిన స్పష్టత

ఈనాడు, హైదరాబాద్‌: అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం నిలిచిపోయింది. అధిక పింఛను గణనపై ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం నేటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రాంతీయ కార్యాలయాల్లో సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు వారికి తోచిన పద్ధతిని అనుసరిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ ఇందౌర్‌కు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి 2017లో పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుమేరకు అధిక పింఛనుకు అర్హులయ్యారు. పదవీ విరమణ నాటికి 22 ఏళ్ల సర్వీసు (రెండేళ్ల బోనస్‌తో కలిపి)తో పింఛను అర్హత వేతనం రూ.87,600గా ఉంది. ఇండోర్‌ ఈపీఎఫ్‌వో అధికారులు ఆ ఉద్యోగి 2014 తరువాత పదవీ విరమణ చేసినందున మొత్తం సర్వీసుకు చివరి 60నెలల వేతన సగటుపై లెక్కించి నెలకు రూ.28,690 పింఛను మంజూరు చేశారు. ఆరేళ్ల బకాయిల కింద ఈ సంవత్సరం జులైలో ఆ విశ్రాంత ఉద్యోగి రూ.18.70లక్షలు అందుకున్నారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ తరువాత వేతన జీవులకు తక్కువ పింఛను లభించేలా రవుర్కెలా ఈపీఎఫ్‌వో కార్యాలయం కొత్త పద్ధతి తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. డిమాండ్‌ నోటీసుల్లో 2014కు ముందు సర్వీసుకు 12 నెలల అర్హత వేతన సగటును పార్ట్‌-1 కింద.. 2014 తరువాత సర్వీసుకు 60 నెలల వేతన సగటును పార్ట్‌-2 కింద గణించి.. ఆ మొత్తాన్ని పింఛనుగా ఇస్తామని వెల్లడించింది. దీనినే ఇందౌర్‌ విశ్రాంత ఉద్యోగికి అమలు చేస్తే దాదాపు 30శాతానికిపైగా పింఛను తగ్గనుంది. ఒకే సంస్థ పరిధిలోని ప్రాంతీయ కార్యాలయాలు వేర్వేరు ఫార్ములాలు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.

స్పష్టత వచ్చే వరకూ...

కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టత వచ్చేవరకు అధిక పింఛను పొందడానికి అదనంగా ఎంత కట్టాలో సూచిస్తూ డిమాండ్‌ నోటీసులు జారీ చేయకూడదని స్థానిక పీఎఫ్‌ కార్యాలయాలు నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే ఇప్పటికే అదనపు ఈపీఎస్‌ చందా మొత్తాన్ని లెక్కించి జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల తాలూకు వ్యవహారాలను కూడా పరిష్కరించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర కార్యాలయానికి లేఖలు రాసినా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రాంతీయ కమిషనర్ల సమావేశంలో రవుర్కెలా ఫార్ములా అమలు చేయాలంటూ కేంద్ర కమిషన్‌ నోటిమాట ద్వారా చెప్పినట్లు తెలిసింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని తద్వారా అర్హులైన వారికి ఒక స్పష్టత వస్తుందని ప్రాంతీయ అధికారులు కోరినప్పటికీ.. కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జూన్‌లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం పింఛను లెక్కించాలని, పదవీ విరమణ చేసిన వారికి ఎంత పింఛను వస్తుందో డిమాండ్‌ నోటీసుల్లో తెలియజేయాలని ఇప్పటికే ఈపీఎఫ్‌వో సీబీటీ సభ్యుడు సుంకరి మల్లేశం కేంద్ర ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు లేఖ రాశారు. జూన్‌లో ఇచ్చిన స్పష్టత ప్రకారం 2014 సెప్టెంబరు 1 నాటికి రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కించాలని,  2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా గణించాలని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని