దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భూరి విరాళం

ఈడీ, సీబీఐ, ఐటీశాఖల దర్యాప్తును ఎదుర్కొంటున్న 41 కంపెనీలు భాజపాకు రూ.2,471 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాయని వీటిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన పిటిషనర్లైన సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.

Updated : 23 Mar 2024 06:08 IST

భాజపాకు రూ.2,471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు
పిటిషనర్ల ఆరోపణ

దిల్లీ: ఈడీ, సీబీఐ, ఐటీశాఖల దర్యాప్తును ఎదుర్కొంటున్న 41 కంపెనీలు భాజపాకు రూ.2,471 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాయని వీటిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన పిటిషనర్లైన సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఈ సంస్థల్లో సోదాలు జరిగాక ఇచ్చిన విరాళాలే రూ.1,698 కోట్లని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

  • ‘30 షెల్‌ కంపెనీలు రూ.143 కోట్ల ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి.
  • ప్రభుత్వం నుంచి 172 కాంట్రాక్టులను పొందిన 33 కంపెనీలు ఎన్నికల బాండ్లను కొన్నాయి. వాటికి 3.7 లక్షల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయి. అందుకు ప్రతిగా వారు భాజపాకు రూ.1,751 కోట్ల విరాళాలను ఇచ్చారు.
  • ఐటీ సోదాలు జరిగిన 3 నెలల్లోపే కల్పతరు గ్రూపు భాజపాకు రూ.5.5 కోట్ల విరాళాలిచ్చింది. గత ఏడాది ఆగస్టు 3వ తేదీన సోదాలు జరిగాయి.
  • ఐటీ సోదాలు జరిగిన 3 నెలల్లోపే ఫ్యూచర్‌ గేమింగ్‌ కంపెనీ భాజపాకు రూ.60 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చింది.
  • 2022 నవంబరు 10న అరబిందో ఫార్మాలో ఈడీ సోదాలు జరిగాయి. అది జరిగిన 3 నెలల్లోపే ఆ సంస్థ భాజపాకు రూ.5 కోట్ల విరాళాలిచ్చింది’ అని ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు.

‘అతిపెద్ద కుంభకోణం’

స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది అతి పెద్ద కుంభకోణం అని ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఇందులో మొదటిది ‘చందా ఇవ్వు.. దందా చేసుకో (చందా దో.. దందా లో)’ అనే పథకమని ఆరోపించారు. రెండోది ‘మామూళ్ల వసూలు (హఫ్తా వసూలీ)’, మూడోది ‘కాంట్రాక్టు తీసుకో.. లంచం ఇవ్వు (ఠేకా లో.. రిష్వత్‌ దో)’ అని పేర్కొన్నారు.


భాజపాకే అధికం

కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంద్వారా భాజపాకే అధికంగా నిధులు వచ్చాయి. దాదాపుగా కంపెనీలన్నీ ఆ పార్టీకే ఎక్కువ ఇచ్చాయి. ప్రముఖ కంపెనీల నుంచి పేరులేని కంపెనీల వరకూ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి. వాటిలో కొన్ని వివరాలివీ..

భారతీ ఎయిర్‌టెల్‌

భారతీ ఎయిర్‌టెల్‌, దాని సబ్సిడరీ భారతీ టెలీమీడియా సంస్థలు భాజపాకు ఎన్నికల బాండ్ల రూపంలో రూ.234.5 కోట్ల విరాళాలిచ్చాయి. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.197.5 కోట్లను ఇచ్చింది. భారతీ టెలీమీడియా రూ.37 కోట్లను విరాళంగా అందించింది. ఈ సంస్థలు జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు రూ.50 లక్షలు, ఆర్జేడీకి రూ.10 లక్షలు ఇచ్చాయి. దీనిపై వివరణ కోరేందుకు ఈ మెయిల్‌ ద్వారా ప్రయత్నించగా ఆ సంస్థలు స్పందించలేదు.

ఎస్సెల్‌ మైనింగ్‌

ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్‌కు ఏకంగా రూ.174.5 కోట్ల విరాళాలిచ్చింది. భాజపాకు ఈ సంస్థ రూ.49 కోట్లను ఇచ్చింది. ఎస్సెల్‌ మైనింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా ఒడిశాలో జరుగుతున్నాయి.

పిరమాల్‌

పిరమాల్‌ గ్రూప్‌నకు చెందిన మూడు ఫైనాన్స్‌ కంపెనీలు పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పిరమాల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీహెచ్‌ఎల్‌ ఫిన్‌వెస్ట్‌ కంపెనీలు భాజపాకు రూ.85 కోట్ల విరాళాలిచ్చాయి.

  • పిరమాల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.10 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది.
  • పిరమాల్‌ ఫిన్‌వెస్ట్‌ రూ.40 కోట్లు, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.35 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి.

కొటక్‌ కుటుంబం

కొటక్‌ కుటుంబానికి చెందిన పెద్దగా పేరులేని ఇన్ఫినా ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ భాజపాకు రూ.60 కోట్ల విరాళమిచ్చింది.

నవయుగ

నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఈసీ) భాజపాకు రూ.55 కోట్ల విరాళమిచ్చింది. 2019 ఏప్రిల్‌ 19, 2022 అక్టోబరు 10 మధ్య ఈ బాండ్ల కొనుగోళ్లు జరిగాయి.

అరబిందో ఫార్మా

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా మొత్తం రూ.52 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ఆ సంస్థ డైరెక్టరు శరత్‌ చంద్రారెడ్డి దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నారు. భాజపాకు ఈ సంస్థ రూ.34.5 కోట్లను ఇచ్చింది. భారాసకు రూ.15 కోట్లు ఇచ్చింది. తెదేపాకు రూ.2.5 కోట్లను విరాళంగా ఇచ్చింది. మద్యం కేసులో శరత్‌ చంద్రారెడ్డి అరెస్టయిన తర్వాత 5 రోజులకు రూ.5 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. అవన్నీ భాజపాకే వెళ్లాయి. దీనిపై వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోని రాలేదు. ఈ సంస్థ 2023 నవంబరు 8న రూ.25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వాటిని భాజపా అదే నెల 17వ తేదీన నగదుగా మార్చుకుంది.

టెక్నాలజీ కంపెనీలు..

  • సైయెంట్‌ ఐటీ సంస్థ భాజపాకు రూ.10 కోట్ల విరాళాలిచ్చింది.
  • జెన్సార్‌ టెక్నాలజీస్‌ సంస్థ రూ.3 కోట్లతో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. అవన్నీ భాజపాకే వెళ్లాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని