మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే

దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.

Updated : 26 Apr 2024 06:15 IST

తాజా అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెల్లడి
అసత్యాల యంత్రం ఈడీ : ఆప్‌

దిల్లీ: దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓ నేరానికి సంబంధించిన ఆధారాలతో చేసిన అరెస్టు.. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల భావనను ఉల్లంఘించడం కాదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆదాయంలో కొంత భాగం బయటపడిందని.. గోవా శాసనసభ ఎన్నికల కోసం ఆప్‌ రూ.45 కోట్ల వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించింది. మద్యం విధానంలో మేళ్లు కలిగించేందుకు సంబంధిత వ్యాపారుల నుంచి ప్రయోజనాలను డిమాండ్‌ చేయడంలో కేజ్రీవాల్‌ తన మంత్రులు, ఆప్‌ నాయకులతో కలిసి పనిచేశారని ఈడీ తన 734 పేజీల కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. ‘‘కొందరు వ్యక్తులకు మేళ్లు కలిగించేందుకు 2021-22 మద్యం విధాన రూపకల్పనలో కేజ్రీవాల్‌ పాలుపంచుకున్నారు. అంతేకాకుండా అలా మేళ్లు కల్పించినందుకు బదులుగా మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు డిమాండ్‌ చేయడంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు’’ అని అందులో వివరించింది. ఈడీ తనను అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల సిద్ధాంతాన్ని ఉల్లంఘించడమేనన్న కేజ్రీవాల్‌ వాదనపై ఈడీ కౌంటర్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఆప్‌..‘‘ఈడీ అసత్యాల యంత్రం తప్ప మరొకటి కాదు. తమ యజమాని భాజపా ఇష్టప్రకారం ఎప్పటికప్పుడు కొత్త అబద్ధాలను సృష్టిస్తోంది’’ అని అభివర్ణించింది.


జైలుకు సమాధానం ఓటుతో..!
- ఆప్‌ ప్రచార గీతం విడుదల

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గురువారం తమ లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో జైలుకు సమాధానం ఓటుతో చెబుతామంటూ ఈ పాట కొనసాగుతుంది. ఈ గీతాన్ని ఆప్‌ ఎమ్మెల్యే దిలీప్‌ పాండే రాశారు. ఆయనే ర్యాప్‌ శైలిలో పాడారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ కూడా పాల్గొననున్నారని ఆప్‌ వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలో ఆమె తూర్పు దిల్లీ నుంచి ప్రచారం ప్రారంభిస్తారని పేర్కొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని