100% వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది.

Updated : 27 Apr 2024 18:59 IST

ఈవీఎంలు నమ్మకమైనవే... కాల పరీక్షలో నెగ్గాయి
వాటిపై ఆరోపణలను నిరూపించే ఆధారాల్లేవు
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ
వేర్వేరుగా తీర్పులు... అయినా ఏకాభిప్రాయం
అభ్యర్థుల గుర్తులను లోడ్‌ చేసిన తర్వాత ఈవీఎంలోని ఆ యూనిట్‌కు సీల్‌ వేయాలని ఈసీకి సూచన
ఓడిన అభ్యర్థులకు మైక్రోకంట్రోలర్‌లోని చిప్‌ల తనిఖీకి అవకాశమివ్వాలని ఆదేశం

దేశ పేరు ప్రతిష్ఠలను, పురోగతిని సాధ్యమైన మేరకు అన్నివిధాలుగా బలహీనపరచడానికి, అపఖ్యాతి పాలుజేయడానికి కలిసికట్టు ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. అలాంటి ప్రయత్నాలు, ఆలోచనలను అంకుర దశలోనే తుంచివేయాలి.


పేపర్‌ బ్యాలట్‌ వ్యవస్థకు తిరిగి వెళ్లాలన్న పిటిషనర్ల సూచన ఈవీఎం వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయాలన్న వారి అసలు ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. ఓటర్ల మదిలో అనవసర సందేహాలు రేకెత్తించి తద్వారా ఎన్నికల ప్రక్రియను గాడి తప్పేలా చేయాలన్నది కూడా వారి ప్రయత్నం కావచ్చన్న ఎన్నికల సంఘం న్యాయవాది అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

 తీర్పులో జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా


దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లనూ తోసిపుచ్చింది. ఏ వ్యవస్థనైనా గుడ్డిగా ఆటంకపరచడం అవాంఛనీయమైన సంశయవాదానికి దారి తీస్తుందని హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలోని ఓట్లను 100 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఏ ఇతర దేశంలోని ఎన్నికల ప్రక్రియతోనూ దీనిని ముడిపెట్టి చూడలేమని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విడివిడిగా రెండు తీర్పులు వెలువరించింది. అయితే, ఆ తీర్పుల్లో ఏకాభిప్రాయం వ్యక్తంకావడం గమనార్హం. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు ఈవీఎంలను ర్యాండమ్‌గా ఎంపికచేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు. అలా కాకుండా వీవీప్యాట్‌ స్లిప్పులు అన్నింటినీ లెక్కించాలన్నది పిటిషనర్ల డిమాండ్‌.

ఓటింగ్‌ అనంతరం వీవీప్యాట్‌ నుంచి వచ్చే స్లిప్పును ఓటరు చేతికే ఇవ్వాలని, ఓటు సక్రమంగా నమోదైందో లేదో చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న బ్యాలట్‌ బాక్సులో దానిని వేసేందుకు అనుమతించాలన్న పిటిషనర్ల అభ్యర్థననూ ధర్మాసనం తోసిపుచ్చింది. ఓటరు చేతికి వీవీప్యాట్‌ స్లిప్పు ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, అనేక సమస్యలు వస్తాయని తెలిపింది. విదేశాల్లో మాదిరిగా పేపర్‌ బ్యాలట్‌ విధానానికే వెనుదిరిగి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలన్న వినతికీ ధర్మాసనం సమ్మతించలేదు. ఈవీఎం విధానంలోని లోపాలను ఎత్తిచూపడంలో తప్పులేదని పేర్కొంది. అయితే, మెరుగుపరచుకునేలా సూచనలివ్వక పోగా అపోహలు సృష్టించి వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా చేయడం తగదని హితవు పలికింది.కాల పరీక్షకు ఈవీఎంలు నెగ్గాయని, ఓటింగ్‌ శాతం పెరగడం కూడా ప్రస్తుత వ్యవస్థపై ఓటరు విశ్వాసాన్ని తెలియజేస్తోందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా అభిప్రాయపడ్డారు. ఈవీఎంల రాకతో పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, బోగస్‌ ఓటింగ్‌ వంటివి తగ్గిపోయాయన్నారు. ఈవీయంలు దుర్వినియోగమైనట్లు పిటిషనర్లు ఒక్క దృష్టాంతాన్నీ చూపలేకపోయారని తెలిపారు.

ఈసీకి కీలక ఆదేశాలు

వీవీప్యాట్ల స్లిప్పులను 100శాతం సరిపోల్చాలన్న కొన్ని రాజకీయ పార్టీల దీర్ఘకాల డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చినప్పటికీ ఎన్నికల సంఘానికి రెండు కీలక ఆదేశాలిచ్చింది. మే నెల ఒకటో తేదీ నుంచి ఈవీఎంల్లో అభ్యర్థుల గుర్తుల లోడింగ్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆ యూనిట్లను సీల్‌ చేయాలని తెలిపింది. ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని కనీసం 45 రోజుల వరకు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపర్చాలని పేర్కొంది. ఓడిన అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోపు తెలియజేయాలని సూచించింది. వారి విజ్ఞప్తి మేరకు ఇంజినీర్ల బృందం 5శాతం ఈవీఎంలలోని మైక్రోకంట్రోలర్‌ చిప్‌లను తనిఖీ చేయవచ్చని తెలిపింది. ఇందుకయ్యే ఖర్చులను ఆ అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్‌ అయినట్లు తేలితే ఆ ఖర్చులను వారికి తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ యంత్రాలను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని ఈసీకి జస్టిస్‌ ఖన్నా సూచించారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల గుర్తుతో పాటు బార్‌ కోడ్‌ ఏర్పాటుకు ఉన్న అవకాశాన్నీ పరిశీలించాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని