పూంఛ్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.

Published : 06 May 2024 05:06 IST

భారీగా గాలింపు చర్యలు
పలువురి నిర్బంధం
ఐఏఎఫ్‌ వాహనశ్రేణి దాడిలో గాయపడిన సైనికుల్లో ఒకరి పరిస్థితి విషమం

మేంఢర్‌/జమ్ము: భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన వాహనశ్రేణిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం సైన్యం, జమ్మూ పోలీసులు భారీస్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం పూంఛ్‌ జిల్లాలోని సురన్‌కోట్‌ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో నలుగురు సైనికులకు గాయాలయ్యాయి. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరొక సైనికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని అనుమానిస్తున్నారు. దీంతో షహసితార్‌, గురుసాయ్‌, సనాయ్‌, షీన్‌దార్‌ టాప్‌ ప్రాంతాలను సైన్యం, పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే పలువురిని నిర్బంధించి విచారణ జరుపుతున్నారు. దాడిలో ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్‌తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్‌ను, స్టీల్‌ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. మృతి చెందిన కార్పొరల్‌ విక్కీ పహాడెకు భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరీ నివాళి అర్పించారు. దాడిని కాంగ్రెస్‌ ఖండించింది. 2007-14 మధ్య పూంఛ్‌ ప్రాంతంలో భారీ ఉగ్రవాద ఘటనలు జరగలేదని, తాజా దాడులు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని కట్టడిచేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని