నీట్‌ పేపర్‌ లీక్‌ కాలేదు: ఎన్‌టీఏ

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఖండించింది.

Published : 06 May 2024 06:50 IST

దిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఖండించింది. పేపర్‌ లీక్‌ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపుర్‌ బాలికల హయ్యర్‌ సెకండరీ మోడల్‌ స్కూల్‌లో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఆంగ్ల మాధ్యమం ప్రశ్నపత్రం వచ్చిందని.. ఇన్విజిలేటర్‌ ఆ పొరపాటును సరిదిద్దేటప్పటికే దాదాపు 120 మంది విద్యార్థులు పరీక్ష హాలు నుంచి ప్రశ్నపత్రంతో బలవంతంగా బయటకు వెళ్లిపోయారని ఎన్‌టీఏ సీనియర్‌ అధికారి తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం 4గంటల సమయంలో పేపర్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిందని వివరించారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలవడంతో ప్రశ్నపత్రం లీక్‌ అవలేదని, దీని ప్రభావం ఏ కేంద్రంపై పడలేదని స్పష్టంచేశారు. పరీక్షా కేంద్రాల్లో ఇతర ప్రశ్నపత్రాలను అందుకున్న వారికి సమానావకాశాలు కల్పించడం కోసం ఆదివారం తిరిగి పరీక్షను నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత విషయంలో రాజీపడబోమని ఎన్‌టీఏ పేర్కొంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు/పట్టణాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్‌ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని