బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు.

Published : 08 May 2024 06:04 IST

కేజ్రీవాల్‌కు స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసే అంశంపై మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని పేర్కొంది.    ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని  జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధర్మాసనం అభిప్రాయాన్ని ఈడీ తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యతిరేకించారు.  అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఒకవేళ ఈ కేసులో మీకు (కేజ్రీవాల్‌కు) బెయిల్‌ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని తెలిపింది. ఇందుకు కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ అంగీకరించారు. సీఎం ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని, అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దస్త్రాలను తిరస్కరించకుండా చూడాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ‘‘బుధవారం వాదనలు వింటాం. వీలుకాకపోతే గురువారం విచారణ చేస్తాం. ఆ రోజూ కుదరకపోతే వచ్చే వారం వింటాం’’ అని జస్టిస్‌ ఖన్నా తెలిపారు.  మరోవైపు ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు దిల్లీ రౌజ్‌ ఎవెన్యూ కోర్టులోని సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా పొడిగించారు. సీబీఐ కేసులో మనీశ్‌ సిసోదియా కస్టడీని కూడా ఈ నెల 15 వరకు పొడిగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని