దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు

దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌’ ఛైర్మన్‌ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది.

Updated : 09 May 2024 05:57 IST

మరో వివాదంలో శాం పిట్రోడా.. ‘కాంగ్రెస్‌’ పదవికి రాజీనామా

దిల్లీ: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌’ ఛైర్మన్‌ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. వారసత్వ పన్ను గురించి మాట్లాడి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీని ఆయన ఇరుకునపడేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో భిన్నత్వం గురించి చెప్పడానికి- దక్షిణాదివాళ్లు నల్లగా ఉంటారనడంపై ప్రధాని నరేంద్రమోదీ సహా భాజపా నేతలు ఆక్షేపణ తెలిపారు. చర్మం రంగు ఆధారంగా వివక్ష చూపి అవమానించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు సహించబోరని దుయ్యబట్టారు. భారత్‌ను వైవిధ్యభరిత దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన పోలికలు చెప్పిన తీరు వివాదాస్పదమైంది. ‘ది స్టేట్స్‌మన్‌’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో- భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడారు. ‘‘మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు. ఇవన్నీ ఎలాఉన్నా.. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయి’’ అని అన్నారు.

 ఇది జాతి వివక్షే: భాజపా

గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన పిట్రోడా వ్యాఖ్యలు మన దేశం పట్ల సోనియా, రాహుల్‌ల ఆలోచనను ప్రతిబింబిస్తాయని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఇది సిగ్గుచేటు అని, దీనికి కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని అన్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాకుర్‌ తదితరులు కూడా పిట్రోడా మాటల్ని ఖండించారు. ‘కాంగ్రెస్‌ నాయకత్వం విదేశీయులది. అందుకే భారతీయులను విదేశీ మూలాలుగా చూస్తున్నారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోంది’ అని భాజపా ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. ‘నేను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తిని. కానీ భారతీయుడిలా కన్పిస్తా. వైవిధ్య భారతావనిలో మనం విభిన్నంగా కన్పించినా మనమంతా ఒక్కటే. దేశం గురించి కనీస పరిజ్ఞానం పెంచుకోండి’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ హితవు పలికారు. పిట్రోడా వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను గాయపరిచాయని మణిపుర్‌ సీఎం బీరేన్‌సింగ్‌, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా పేర్కొన్నారు. భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీకి మెంటార్‌గా ఉన్న పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. పిట్రోడా వ్యాఖ్యలను ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలేవీ సమర్థించట్లేదని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ చెప్పారు. ‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. పార్టీకి, పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ స్పష్టంచేశారు. రాజకీయ వివాదం నేపథ్యంలో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. దానిని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని