Afghanistan crisis: మిగిలింది 5 రోజులే.. ఏం చేసినా ఆగస్టు 31లోపే!

సమయం దగ్గరపడుతోంది.. డెడ్‌లైను ముంచుకొస్తోంది. ఎవరేం చేసినా అయిదు రోజుల లోపే! ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాలిబన్ల ఆటవిక పాలన తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతుంటే.. బాంబు దాడులు జరుగుతాయన్న హెచ్చరికలతో ఇతర దేశాలు సైతం హడలెత్తిపోతున్నాయి. ఆగస్టు 31.. ఇప్పుడు అందరి కన్నూ ఈ తేదీపైనే ఉంది....

Updated : 27 Aug 2021 06:59 IST

కాబుల్‌: సమయం దగ్గరపడుతోంది.. డెడ్‌లైను ముంచుకొస్తోంది. ఎవరేం చేసినా అయిదు రోజుల లోపే! ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాలిబన్ల ఆటవిక పాలన తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతుంటే.. బాంబు దాడులు జరుగుతాయన్న హెచ్చరికలతో ఇతర దేశాలు సైతం హడలెత్తిపోతున్నాయి. ఆగస్టు 31.. ఇప్పుడు అందరి కన్నూ ఈ తేదీపైనే ఉంది. అమెరికా నుంచి అఫ్గానిస్థాన్‌ వరకు అన్ని దేశాలూ ఆ రోజు ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నాయి. అఫ్గాన్‌ నుంచి అమెరికా సహా నాటో కూటమి సైన్యం ఉపసంహరణకు చివరిరోజు అదే. డెడ్‌లైను దాటిన తర్వాత కూడా అఫ్గాన్‌లోని పౌరులను, నాటో దళాలకు సహకరించినవారిని తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే తాలిబన్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కూడా ఈ గడువును పొడిగించేలా కనిపించడం లేదు. ఆగస్టు 31 గడువులోపే అమెరికా పౌరులను అక్కడి నుంచి తరలించాలని చూస్తోంది. డెడ్‌లైను పొడిగించాలని అమెరికాపై మిత్ర దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఇప్పటివరకు 82 వేల మందిని ఆ దేశం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇందులో బుధవారం ఒక్కరోజే 19 వేల మందిని తీసుకురావడం గమనార్హం. ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి భారీగా చేరుకొంటున్నందున తరలింపు ప్రక్రియ కష్టమవుతోందని కాబుల్‌లోని అమెరికా ఎంబసీ పేర్కొంది. మరోవైపు.. కాబుల్‌ విమానాశ్రయానికి ఐసిస్‌ దాడుల ముప్పు పొంచి ఉన్నటు అమెరికా నిఘావర్గాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. రాజధానిని హస్తగతం చేసుకోగానే.. వేలాది ఐసిస్‌, అల్‌ఖైదా ఉగ్రవాదులను తాలిబన్లు జైళ్ల నుంచి విడుదల చేశారు. వీరు అమెరికా సైన్యంపై ప్రతీకార దాడులకు తెగబడొచ్చని అనుమానిస్తున్నారు. తాలిబన్ల అధీనంలో లేని ఏకైక ప్రాంతమైన పంజ్‌షేర్‌లో పరిస్థితులు వాడీవేడిగా ఉన్నాయి. అనేక మంది తాలిబన్లు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు పావులు కదుపుతున్నారు. అంతర్యుద్ధం తలెత్తకుండా పలువురు నేతలతో చర్చలు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, ముఖ్యనేత అబ్దుల్లా అబ్దుల్లా సహా 8 మంది కీలక నేతలను ప్రభుత్వంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో పంజ్‌షేర్‌ యువనేత అహ్మద్‌ మసూద్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


అఫ్గాన్‌ నుంచి మనవాళ్లందరినీ తరలిస్తాం

అఖిలపక్ష సమావేశంలో జైశంకర్‌

దిల్లీ:  అఫ్గానిస్థాన్‌ నుంచి భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతానికి అదే తొలి ప్రాధాన్యమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. తాలిబన్లతో సంబంధాలు ఎలా ఉండాలనేది కొన్నాళ్లు వేచి చూసిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. అఫ్గాన్‌లో పరిణామాలను వివరించడానికి గురువారం ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం వివరాలను విలేకరులకు వెల్లడించారు. సమావేశంలో తెరాస తరఫున నామా నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్‌, వైకాపా నుంచి మిథున్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని