కోడలి నగలు భద్రపరచడాన్ని వేధింపుగా పరిగణించలేం

కోడలి నగలును భద్రపరచడం, భర్తతో సర్దుకుపొమ్మని చెప్పడం వంటి వాటిని భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 498ఏ నిబంధన కింద అత్తింటివారి వేధింపులుగా భావించలేమని సుప్రీంకోర్టు

Published : 15 Jan 2022 07:23 IST

సెక్షన్‌ 498ఏ నిబంధనపై సుప్రీం స్పష్టత

దిల్లీ: కోడలి నగలును భద్రపరచడం, భర్తతో సర్దుకుపొమ్మని చెప్పడం వంటి వాటిని భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 498ఏ నిబంధన కింద అత్తింటివారి వేధింపులుగా భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విడిగా జీవిస్తున్న అన్నను నియంత్రించలేకపోవడం, అతనిపై ప్రతీకార చర్యలకు దిగవద్దని వదినకు సలహానివ్వడం వంటివి కూడా  వేధింపులుగా పరిగణించలేమని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిల ధర్మాసనం తీర్పునిచ్చింది. అమెరికా వెళ్లేందుకు అనుమతివ్వాలన్న అభ్యర్థనను వదిన ఫిర్యాదు కారణంగా పంజాబ్‌-హరియాణా హైకోర్టు తిరస్కరించడంతో దానిని సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  కేసు పూర్వపరాలను పరిశీలించిన ధర్మాసనం అతను అమెరికా వెళ్లేందుకు అనుమతించింది. సెక్షన్‌ 498ఏ నిబంధన..భార్యను ఆమె భర్త, లేదా భర్త తరఫుబంధువులు వేధించినప్పుడే  వర్తిస్తుందని పేర్కొంది. భర్త, ఆయన సోదరుడు, అత్తమామలు   తనను మోసం చేశారని, నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, బాధించారని పేర్కొంటూ ఓ మహిళ సెక్షన్‌ 498ఏ కింద ఫిర్యాదు చేయడంతో కురుక్షేత్రలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌...పిటిషనర్‌(భర్త తమ్ముడు) ముందస్తు అనుమతి లేనిదే దేశం వీడి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. హైకోర్టుకు వెళ్లినా ఉపశమనం లభించకపోవడంతో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని