‘వీధి’ వంచితులకు వెంటనే పునరావాసం కల్పించండి

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి వీధిపాలైన బాలలకు పునరావాసం కల్పించే అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి వారిని గుర్తించి, వెంటనే పునరావాసం కల్పించాలని జిల్లా మేజిస్ట్రేట్లను

Updated : 18 Jan 2022 05:39 IST

జిల్లా మేజిస్ట్రేట్లకు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి వీధిపాలైన బాలలకు పునరావాసం కల్పించే అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. అలాంటి వారిని గుర్తించి, వెంటనే పునరావాసం కల్పించాలని జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించింది. ఈ విషయంలో ప్రత్యేక పోలీసు విభాగం (ఎస్‌జేపీయూ), జిల్లా న్యాయసేవా సంస్థ (డీఎస్‌ఎస్‌ఏ), స్వచ్ఛంద సంస్థలను భాగస్వామం చేయాలని సూచించింది. ఇలాంటి చిన్నారులకు సంబంధించిన వివరాలను ‘బాల్‌ స్వరాజ్‌’ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్లకు సూచించింది. అనాథ బాలలకు పునరావాసం కల్పించే అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ వాదనలు వినిపించారు. ఒక్క దిల్లీ వీధుల్లోనే సుమారు 70 వేల మంది చిన్నారులు ఉన్నారని ఆ కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకు సంబంధించిన వివరాలను ‘బాల్‌ స్వరాజ్‌’ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయలేదని పేర్కొంది. ధర్మాసనం కలుగజేసుకుని- బాధిత బాలలకు పునరావాసం కల్పించే విషయమై మూడు వారాల్లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను, యూటీలను ఆదేశించింది.


అభ్యర్థుల నేర చరిత్రను రాజకీయ పార్టీలు వెల్లడించాలి

సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన వివరాలను, వారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారన్న విషయాన్ని మీడియాలో వెల్లడించేలా చూడాలని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో... న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ దీన్ని దాఖలు చేశారు. ‘‘అభ్యర్థుల నేర చరిత్రతో పాటు అలాంటి వారికి టికెట్లు ఎందుకు కేటాయించారన్నది రాజకీయ పార్టీలు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాతో పాటు తమ వెబ్‌సైట్‌లో వెల్లడించాలి.
దీన్ని తప్పకుండా పాటించేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి. అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించని రాజకీయ పార్టీల అధ్యక్షులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి. అలాంటి పార్టీల నమోదును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి’’ అని అభ్యర్థించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ నహీద్‌ హసన్‌ను సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అతని నేరచరిత్రను ఎస్పీ వెల్లడించలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని