ఢీ కొట్టుకున్నంత పనిచేశాయి

బెంగళూరు విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అధికారుల సమన్వయ లోపం వల్ల రెండు విమానాలు గాల్లో పరస్పరం ఢీ కొట్టుకున్నంత పనిచేశాయి. అప్రమత్తంగా ఉన్న అప్రోచ్‌ రాడార్‌

Published : 20 Jan 2022 05:23 IST

గాల్లో ప్రమాదకరంగా చేరువైన రెండు విమానాలు

చివరి నిమిషంలో చక్కదిద్దిన రాడార్‌ కంట్రోలర్‌

బెంగళూరు విమానాశ్రయంలో 426 మందికి తప్పిన ముప్పు

దిల్లీ: బెంగళూరు విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అధికారుల సమన్వయ లోపం వల్ల రెండు విమానాలు గాల్లో పరస్పరం ఢీ కొట్టుకున్నంత పనిచేశాయి. అప్రమత్తంగా ఉన్న అప్రోచ్‌ రాడార్‌ కంట్రోలర్‌ చివరి నిమిషంలో ప్రమాదాన్ని పసిగట్టి దిద్దుబాటు చర్యలకు దిగడంతో 426 మంది ప్రయాణికులు, సిబ్బందికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని వివరాలను లాగ్‌ బుక్‌లో నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కూడా స్పందించి పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)కు దీన్ని నివేదించలేదని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ అధిపతి అరుణ్‌ కుమార్‌ స్పష్టంచేశారు. ఈ ఘటనలో ప్రమాదానికి చేరువగా వెళ్లిన రెండు విమానాలూ ఇండిగో సంస్థకు చెందినవేనని అధికారులు తెలిపారు. డీజీసీఏ ప్రాథమిక నివేదిక ప్రకారం..

* బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్తర, దక్షిణ రన్‌వేలు ఉన్నాయి. ఈ నెల 9న ఉదయం కొద్దిసేపు ఉత్తర రన్‌వే నుంచి విమానాలు టేకాఫ్‌ కాగా.. ల్యాండింగ్‌ మాత్రం దక్షిణ రన్‌వేపై సాగింది. ఆ తర్వాత ఇందులో మార్పు జరిగింది. టేకాఫ్‌, ల్యాండింగ్‌ రెండింటినీ ఉత్తర రన్‌వే నుంచే చేయాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ రన్‌వేను మూసేశారు.

* ఈ విషయాన్ని దక్షిణ టవర్‌లోని కంట్రోలర్‌కు తెలియజేయలేదు. దీంతో ఆ కంట్రోలర్‌.. కోల్‌కతాకు వెళ్లే 6ఈ-455 విమానం టేకాఫ్‌కు అనుమతిచ్చారు. దాదాపుగా అదే సమయంలో ఉత్తర టవర్‌ కంట్రోలర్‌.. భువనేశ్వర్‌కు వెళ్లే 6ఈ-246 విమాన ప్రయాణానికి సమ్మతించారు.

* సమన్వయం లేకుండా ఇద్దరు కంట్రోలర్లు వ్యవహరించారు. దీంతో ఇరు రన్‌వేల నుంచి రెండు విమానాలు ఒకే దిశలో గాల్లోకి లేచాయి. దాదాపు 3వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి. ఆ తర్వాత అవి పరస్పరం చేరువ కావడం మొదలైంది.

* ఈ దశలో.. జరగబోతున్న ప్రమాదాన్ని అప్రోచ్‌ రాడార్‌ కంట్రోలర్‌ గుర్తించారు. ఒక విమానాన్ని కుడివైపునకు, రెండోదాన్ని ఎడమవైపునకు వెళ్లాలని చివరి నిమిషంలో సూచించడంతో పెను ప్రమాదం తప్పింది.

* ఈ వ్యవహారంలో రెండు విమానాల మధ్య ఉండాల్సిన కనీస దూరం విషయంలో ఉల్లంఘన (బ్రీచ్‌ ఆఫ్‌ సెపరేషన్‌) జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని