అరుణాచల్‌ టు లద్దాఖ్‌..బచేంద్రిపాల్‌ మరో సాహస యాత్ర

ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్‌ మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు.

Updated : 24 Jan 2022 09:13 IST

5 నెలల్లో 4,625 కి.మీ. యాత్ర

జంశెద్‌పుర్‌ (ఝార్ఖండ్‌): ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్‌ మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏళ్లు పైబడ్డ పదిమంది మహిళల జట్టుతో అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రోజైన మార్చి 8న బచేంద్రిపాల్‌ 67వ ఏట అడుగు పెడతారు. అదే రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా అయిదు నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగనుంది. వీటిలో 17,320 అడుగుల ఎత్తుతో పర్వతారోహకుల సామర్థ్యాన్ని పరీక్షించే లంఖాగా పర్వతమార్గం కూడా ఉంది. లద్దాఖ్‌లోని ద్రాస్‌ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఆగస్టు మొదటివారం లేదా రెండో వారంతో ఈ యాత్ర ముగుస్తుంది. ‘టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌’,   కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ‘ఫిట్‌ ఇండియా’ బ్యానరుపై నిర్వహిస్తున్న ఈ యాత్ర వాస్తవానికి గతేడాది మేలోనే ప్రారంభం కావాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్‌ పరిస్థితులతో వాయిదా పడి, ఇప్పుడు జరగనుంది.

ఈ బృందంలో : బచేంద్రిపాల్‌, సారథి (67), చేతనా సాహూ (54, కోల్‌కతా), సవితా ధప్వాల్‌ (52, భిలాయ్‌), శ్యామలా పద్మనాభన్‌ (64, మైసూర్‌), గంగోత్రి సోనేజి (62, బరోడా), ఛౌలా జాగిర్దార్‌ (63, పాలన్‌పుర్‌), పాయో ముర్ము (53, జంషెడ్‌పుర్‌), డాక్టర్‌ సుష్మా బిస్సా (55, బికనేర్‌), మేజర్‌ కృష్ణా దూబే (59, లఖ్‌నవూ), బింబ్లా దేవోస్కర్‌ (55, నాగ్‌పుర్‌).

* ఈ బృందానికి ఇటీవలే ఉత్తరకాశిలో వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు. యాత్రలో వీరికి సహకరించేందుకు, వంట పనులకు ఇద్దరు పురుష సభ్యులు కూడా తోడుంటారు. భారత్‌-మయన్మార్‌ సరిహద్దులోని పాంగ్‌సౌ పాస్‌ నుంచి యాత్ర మొదలై అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఠుంగ్రీ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, నేపాల్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల మీదుగా సాగుతూ.. కార్గిల్‌ జిల్లాలోని టైగర్‌ హిల్‌ వద్ద ముగుస్తుంది.

ఈ యాత్ర స్ఫూర్తితో అన్ని వయసుల భారతీయ మహిళల్లో దేహ దారుఢ్యం, ఆరోగ్యం పట్ల స్పృహ పెరుగుతుంది. 50 ఏళ్లకు చేరుకోగానే మన జీవితం అంతమైనట్టు కాదు. ఎవరికివారు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం ద్వారా జీవితాన్ని ఆ తర్వాత కూడా ఆస్వాదించవచ్చు అని చాటడమే ఈ యాత్ర ఉద్దేశం.

- బచేంద్రిపాల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని