జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) తొలి మహిళా ఉప కులపతిగా డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కార్యాలయం....

Published : 08 Feb 2022 04:43 IST

కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు

తెలుగు మూలాలున్న కుటుంబ నేపథ్యం

దిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) తొలి మహిళా ఉప కులపతిగా డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రష్యాలో పుట్టి, తమిళనాడులో చదువుకొన్న శాంతిశ్రీ(59)కి తెలుగు మూలాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. జేఎన్‌యూ పూర్వ విద్యార్థిని అయిన ఈమె ఇందులోనే ఎంఫిల్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలపై పీహెచ్‌డీ చేశారు. జేఎన్‌యూ ఉప కులపతిగా జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమలుపై ప్రధానంగా దృష్టి పెడతానని శాంతిశ్రీ ఈ సందర్భంగా తన ప్రాథమ్యాలు వెల్లడించారు.

* రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుట్టిన శాంతిశ్రీ విద్యాభ్యాసమంతా దాదాపుగా తమిళనాడులోని మద్రాసులోనే సాగింది. తండ్రి ధూళిపూడి ఆంజనేయులు రచయిత, జర్నలిస్టు, రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంటు. ఈయన స్వస్థలం తెనాలి. తల్లి మూలమూడి ఆదిలక్ష్మి రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ ఓరియంటల్‌ ఫ్యాకల్టీ డిపార్ట్‌మెంటులో తమిళ, తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. శాంతిశ్రీకి సైతం తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం ఉంది. కన్నడ, మలయాళం, కొంకణి భాషలు అర్థం చేసుకోగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని