నాడు హాస్యనటుడు.. నేడు ముఖ్యమంత్రి

2008 ఓ టీవీ ఛానల్‌లో హాస్య కార్యక్రమం. ఆ షోకు న్యాయనిర్ణేత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజోత్‌సింగ్‌ సిద్ధూ. అందులో ఒకసారి పంజాబ్‌కే చెందిన ఓ హాస్య కళాకారుడు పాల్గొన్నాడు. సిద్ధూను,

Updated : 11 Mar 2022 06:10 IST

పంజాబ్‌ కాబోయే సీఎం భగవంత్‌ మాన్‌ ప్రస్థానం

2008 ఓ టీవీ ఛానల్‌లో హాస్య కార్యక్రమం. ఆ షోకు న్యాయనిర్ణేత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజోత్‌సింగ్‌ సిద్ధూ. అందులో ఒకసారి పంజాబ్‌కే చెందిన ఓ హాస్య కళాకారుడు పాల్గొన్నాడు. సిద్ధూను, ప్రేక్షకులను తన హాస్య గుళికలతో నవ్వించి..మెప్పించి చప్పట్లు కొట్టించుకున్నాడు. అలా.. నాడు సిద్ధూ ముందు ప్రదర్శన ఇచ్చిన ఆ కమెడియనే త్వరలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న భగవంత్‌ మాన్‌.

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం 11 ఏళ్లలో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం భారత్‌ రాజకీయాల్లో అరుదు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంతో అలాంటి అరుదైన అవకాశం భగవంత్‌మాన్‌కు లభించింది. హాస్యనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన 48 ఏళ్ల మాన్‌ 1973లో సంగ్రూర్‌లోని సతోజ్‌ గ్రామంలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. కళాశాల దశలోనే సామాజిక, రాజకీయ అంశాలపై వ్యంగాస్త్రాలను సంధిస్తూ.. మంచి హాస్యకళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత జుగ్ను కెహెందా హై.. జగ్ను మస్త్‌ మస్త్‌ లాంటి టీవీ సీరియళ్లతో పంజాబ్‌ ప్రజలకు చేరువయ్యారు. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ న్యాయనిర్ణేతగా ఉన్న ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ షో’లో పాల్గొనడంతో హాస్య కళాకారుడిగా పంజాబ్‌లో మాన్‌ పేరు మార్మోగిపోయింది.

మలుపు తిప్పిన ఆ నిర్ణయం

హాస్యకళాకారుడిగా కెరీర్‌ ఉచ్ఛస్థితిలో ఉండగా 2011లో మాన్‌.. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున 2012లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు పీపుల్స్‌ పార్టీ.. కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయం మాన్‌ రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పింది. సంగ్రూర్‌ నుంచి ఆప్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షలకుపైగా ఓట్లతో మాన్‌ విజయం సాధించారు. 2017 ఆసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి ఎదురైంది. అయితే 20 సీట్లు నెగ్గి ఆప్‌ ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో ఆ సమయంలో పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలను కేజ్రీవాల్‌... మాన్‌కే అప్పగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ సంగ్రూర్‌ నుంచి లక్షకుపైగా ఓట్లతో విజేతగా నిలిచి రెండోసారి ఎంపీగా పార్లమెంటులో మాన్‌ అడుగుపెట్టారు.

ప్రజలూ మాన్‌వైపే

తాజా అసెంబ్లీ ఎన్నికల ముందు తమ సీఎం అభ్యర్థి పేరును వెల్లడించాలా.. లేదా అన్న విషయంలో ఆప్‌లో తర్జన భర్జనలు జరిగాయి. ప్రజాభిప్రాయ సేకరణలో 93 శాతం మంది మాన్‌ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపడంతో కేజ్రీవాల్‌.. మాన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.

మాన్‌ రాజకీయ జీవితం 11 ఏళ్లే అయినా అందులో వివాదాలూ లేకపోలేదు. ముఖ్యంగా మద్యం సేవించి పార్లమెంటుకు రావడం వివాదాస్పదమైంది. తర్వాత ఒక బహిరంగ సభలో కేజ్రీవాల్‌, తన అమ్మ ముందు ఇక జీవితంలో ఎన్నడూ మద్యం ముట్టనని మాన్‌ ప్రమాణం చేశారు. ఇంకో సందర్భంలో పార్లమెంటు జరుగుతుండగా సభా కార్యక్రమాలను సామాజిక మాధ్యమ వేదికలో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం కూడా వివాదాస్పదమెంiది. పార్లమెంట్‌ భద్రతపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని