Crime News: గోడలో నోట్ల కట్టలు, వెండి ఇటుకలు

గోడను బద్దలుకొడితే ఏమవుతుంది. ఇటుకలు బయటపడతాయి. అదే ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా కట్టల కొద్దీ నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి.

Updated : 27 Apr 2022 06:57 IST

ముంబయిలో రూ.10 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

ముంబయి: గోడను బద్దలుకొడితే ఏమవుతుంది. ఇటుకలు బయటపడతాయి. అదే ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా కట్టల కొద్దీ నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం నేలలో, గోడలో ఏర్పాటుచేసిన రహస్య అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించిన మహారాష్ట్ర జీఎస్‌టీ అధికారులు ఆ క్రమంలో చాముండా బులియన్‌ టర్నోవర్‌ గత మూడేళ్లలో రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరగడాన్ని గుర్తించారు. దీంతో కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై గత బుధవారం దాడులు నిర్వహించారు. తొలుత కల్బాదేవిలో 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయంలో ఏమీ లభించలేదు. అయినప్పటికీ గదిలో నేలపై ఏర్పాటుచేసిన ఫలకలను (టైల్స్‌) అధికారులు మరింత నిశితంగా పరిశీలించగా ఓ మూలన ఉన్నది కొద్దిగా భిన్నంగా కనిపించింది. అనంతరం ఆ ఫలకను తొలగించి చూడగా.. నగదు కుక్కిన గోనె సంచులు బయటపడ్డాయి. ఈ సంచుల గురించి తమకేమీ తెలియదని కంపెనీ కార్యాలయ యజమాని, అతని కుటుంబసభ్యులు చెప్పడంతో అధికారులు ఆ గదిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారు వచ్చి గదిని పరిశీలించి.. గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులో నుంచీ నగదు నింపిన గోనె సంచులు బయటపడ్డాయి. సోదాల్లో రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు సైతం లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని