సమీక్ష పూర్తయ్యే వరకు రాజద్రోహం కేసుల్ని నిలిపివేయవచ్చు కదా!

వలస పాలకుల నాటి రాజద్రోహం చట్టాన్ని(సెక్షన్‌124ఎ) పునఃపరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన నేపథ్యంలో....కీలకమైన రెండు ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 11 May 2022 06:44 IST

కేంద్రం వైఖరేమిటో నేటిలోగా తెలపాలని ఆదేశించిన సుప్రీం
నేడు కొనసాగనున్న విచారణ

దిల్లీ: వలస పాలకుల నాటి రాజద్రోహం చట్టాన్ని(సెక్షన్‌124ఎ) పునఃపరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ తెలియజేసిన నేపథ్యంలో....కీలకమైన రెండు ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహ చట్ట నిబంధనలు నిరంతరంగా దుర్వినియోగం కావడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. సమీక్ష పూర్తయ్యే వరకు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయవచ్చు కదా అని సూచించింది. ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లి సభ్యులుగా ఉన్నారు. ‘రాజద్రోహం చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల గురించి ప్రభుత్వం ఎటువంటి వైఖరి అనుసరించబోతుందో తెలుసుకుని చెప్పండి’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ధర్మాసనం సూచించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం తెలియజేస్తామని ఆయన సమాధానమిచ్చారు. రాజద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. చట్టంలోని నిబంధనల చెల్లుబాటును పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని, తగిన వేదిక ముందు కేంద్ర ప్రభుత్వమే దీనిపై సమీక్ష చేపట్టనుందని సోమవారం హోంశాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
రాజద్రోహం చట్టంపై పునఃపరిశీలన ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఐపీసీలోని సెక్షన్‌ 124ఎ అమలును నిలిపివేయాలని ఆదేశిస్తూ రాష్ట్రాలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయవచ్చు కదా అని పేర్కొంది. ఒక శిక్షా స్మృతిని ఉపయోగించరాదని దేశ చరిత్రలో సుప్రీంకోర్టు ఎన్నడూ ఆదేశాలివ్వలేదని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. రాష్ట్రాలకు అలాంటి ఆదేశాలు వెళ్లనంత వరకూ క్షేత్రస్థాయిలో ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదవుతూనే ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కేంద్రం సమాధానాన్ని బట్టి రాజద్రోహం చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖైన పిటిషన్లపై విచారణను త్రిసభ్య ధర్మాసనానికి లేదా అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని