ప్రజాస్వామ్యయుత పని విధానాన్నే విశ్వసిస్తా

‘‘నేను ప్రజాస్వామ్యయుతమైన వ్యవహార విధానాన్ని నమ్ముతా. ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించి వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నప్పుడే అన్నీ సజావుగా

Published : 11 May 2022 06:20 IST

 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెల్లడి
 జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ వీడ్కోలు సమావేశంలో ప్రసంగం

ఈనాడు, దిల్లీ: ‘‘నేను ప్రజాస్వామ్యయుతమైన వ్యవహార విధానాన్ని నమ్ముతా. ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించి వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నప్పుడే అన్నీ సజావుగా జరుగుతాయన్నది నా విశ్వాసం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిర్వహించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ పదవీ విరమణ వీడ్కోలు సమావేశంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగించారు. ఇదివరకు కోర్టు ఆవరణలోని లాన్స్‌లో ఇలాంటి వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించడం సంప్రదాయం. ఇప్పటివరకు న్యాయమూర్తులకే పరిమితమైన ఆడిటోరియంలో బార్‌ అసోసియేషన్‌ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతించడం పట్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్‌ రమణ నేతృత్వంలో తాము కూడా ఈ వ్యవస్థలో సమ భాగస్వాములమని భావించగలుగుతున్నామన్నారు. ఈ ఘనత తనకు మాత్రమే చెందదని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టత ఇచ్చారు. ‘‘కోర్టు ఆడిటోరియంను బార్‌ అసోసియేషన్లు కూడా ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చిన ఘనత నాదికాదు. అది కమిటీ సభ్యులైన జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలకు దక్కుతుంది. బార్‌ అసోసియేషన్‌ చేసిన డిమాండ్ల పరిశీలన బాధ్యతలను ఆ కమిటీకి అప్పగించడం మినహా నేనేమీ చేయలేదు. ప్రధాన న్యాయమూర్తిగా నా హయాంలో సాధించిన ఏ విజయమైనా అది మొత్తం న్యాయమూర్తులకు దక్కుతుంది. అన్ని నిర్ణయాలూ సంయుక్తంగా తీసుకున్నవే కాబట్టి దాని ఘనత అందరికీ వెళ్లాలి తప్పితే వ్యక్తులకు కాదు. నాకు అండగా నిలిచిన సహచర న్యాయమూర్తులు, బార్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జస్టిస్‌ వినీత్‌శరణ్‌తో 2002 నుంచి తన స్నేహం కొనసాగుతోందని వెల్లడించారు. ‘‘నాకు అత్యంత సన్నిహితుడైన జస్టిస్‌ శరణ్‌కు వీడ్కోలు పలకడం చాలా బాధగా ఉంది. అలహాబాద్‌ హైకోర్టులో 1980లో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2002లో అక్కడే న్యాయమూర్తిగా పదోన్నతిపొందడంతో పాటు కర్ణాటక, ఒడిశా హైకోర్టుల్లోనూ సేవలందించారు. నాలుగేళ్లు సుప్రీంకోర్టులో పనిచేశారు. ఇక్కడ ఆయన పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగస్వాములవడమే కాకుండా వినియోగదారుల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన తీర్పులు నిరంతరం ప్రభావం చూపుతాయి’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శ్లాఘించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని