Updated : 24 May 2022 08:12 IST

జడ్జీలపై ఆరోపణలు ఫ్యాషనైపోయింది

న్యాయవాదులూ చట్టప్రక్రియకు లోబడే ఉంటారు
మద్రాస్‌ హైకోర్టును ధిక్కరించిన కేసులో సుప్రీం వ్యాఖ్యలు

దిల్లీ: న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం దురదృష్టవశాత్తూ కొత్త ఫ్యాషన్‌గా మారిందని, జడ్జీ ఎంత శక్తిమంతంగా ఉంటే, ఆరోపణలు అంత తీవ్రంగా ఉంటున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మద్రాస్‌ హైకోర్టును ధిక్కరించి, రెండు వారాల జైలుశిక్ష అనుభవించిన ఓ న్యాయవాది దాఖలు చేసిన అప్పీలుపై... జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం ఉత్తరప్రదేశ్‌లో విపరీతంగా ఉందని, ఇప్పుడు అది బొంబాయి, మద్రాస్‌ హైకోర్టుల్లోనూ జరుగుతోందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ జరిగింది

‘ప్రెసిడెన్సీ టౌన్స్‌ ఇన్సాల్వెన్సీ యాక్ట్‌-1909’ నిబంధనల ప్రకారం- సదరు న్యాయవాదికి వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి... ఆరోపణలు ఎదుర్కొంటున్న లాయరుకు వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. హైకోర్టు ప్రాంగణంలోని ఓ తేనీటి దుకాణం వద్దనున్న ఆయనకు వారెంటును అందించేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇతర లాయర్లతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సింగిల్‌ జడ్జిపైనా విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని హైకోర్టు పరిశీలించింది. ఆ న్యాయవాది... న్యాయప్రక్రియను అడ్డుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణ జైలు శిక్ష విధించడమే కాకుండా, ఏడాది పాటు తమ ముందు ప్రాక్టీసు చేయకూడదని సదరు న్యాయవాదిని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జడ్జీలకు పోలీసు రక్షణ ఉండటం లేదు

సదరు న్యాయవాది బేషరతుగా క్షమాపణ చెప్పారని, ఆయన ప్రవర్తనను హైకోర్టు పర్యవేక్షించవచ్చని... వాదనల సందర్భంగా పిటిషనర్‌ తరఫు వకీలు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏడాది వరకూ ఆయన ప్రాక్టీసు చేయకూడదన్న హైకోర్టు ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకునేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘అప్పీలుదారు ప్రవర్తన పూర్తి ధిక్కారస్వభావంతో ఉంది. ఆయనకు వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసిన సింగిల్‌ జడ్జీపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తిని కూడా వ్యతిరేకించారు. ఇది సరికాదు. ఆ న్యాయవాది తన వృత్తికి మచ్చ తెచ్చుకున్నారు. ఇలాంటి వారికి శిక్ష సరైనదే. అయినా, రెండు వారాల జైలు శిక్ష చాలా తక్కువే. న్యాయవాదులు కూడా చట్టప్రక్రియకు లోబడే ఉండాలి. దేశ వ్యాప్తంగా జిల్లా స్థాయిలో న్యాయమూర్తులు దాడులకు గురవుతున్నారు. ఒక్కోసారి వారికి రక్షణ కల్పించేందుకు లాఠీ పట్టుకున్న పోలీసు సిబ్బంది కూడా ఉండటం లేదు. ఈ కేసు ద్వారానైనా గట్టి సందేశం వెళ్లాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని