బాల్యంలో మొసలిని ఇంటికి తెచ్చిన మోదీ.. పాఠ్యాంశంగా ప్రధాని సాహసం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ..

Updated : 20 Jun 2022 09:31 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. ‘‘నేను కొలనులో స్నానం చేస్తుండగా.. ఓ మొసలి పిల్లను చూశాను. దానిని ఇంటికి తీసుకుని వెళ్లాను. మా అమ్మ దానిని చూసి తిట్టడం వల్ల తిరిగి ఆ కొలనులోనే వదిలిపెట్టి వచ్చాను’’ అని చెప్పారు. ఈ సంగతిని ఉదాహరణగా చూపించిన యాజమాన్యం.. ‘‘నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ భారత దేశానికి 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. ఆయన చిన్నతనం నుంచే ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. బాల్యంలోనే ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకువచ్చారు’’ అని పుస్తకంలో ప్రచురించింది. ప్రధానమంత్రి యావత్‌ దేశానికి పర్యవేక్షకుడని ముద్రించింది. ప్రధాన మంత్రి చిన్నతనంలోని సాహసాలను ప్రచురించడం ఇదే తొలిసారి కాదు. గతంలో రన్నడే ప్రకాశన్‌ ‘బాల్‌ నరేంద్ర - చైల్డ్‌ స్టోరీస్‌ ఆఫ్‌ నరేంద్ర మోదీ’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో మోదీ బాల్యంలో చేసిన అనేక సాహసోపేత విషయాలను వెల్లడించారు. ఈ కథల్లో ఒకటి పాఠకులను విస్మయానికి గురిచేసింది. ‘‘మోదీ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొలనులో స్నానం చేస్తుండగా ఓ మొసలి దాడి చేసింది. ఆ ప్రమాదంలో మోదీ కాలికి గాయం కాగా.. తొమ్మిది కుట్లు పడ్డాయి’’ అన్నది ఆ కథ సారాంశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని