ఐదేళ్లలో ప్రస్తుత, మాజీ ఎంపీల రైలు ప్రయాణాల బిల్లు రూ. 62 కోట్లు

గత ఐదేళ్లలో.. లోక్‌సభ ప్రస్తుత, మాజీ సభ్యుల రైలు ప్రయాణాల వల్ల ఖజానాపై రూ. 62 కోట్లు భారం పడింది. ఈమేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన మీదట లోక్‌సభ సచివాలయం సమాచారం

Published : 01 Jul 2022 04:36 IST

లోక్‌సభ సచివాలయం వెల్లడి

దిల్లీ: గత ఐదేళ్లలో.. లోక్‌సభ ప్రస్తుత, మాజీ సభ్యుల రైలు ప్రయాణాల వల్ల ఖజానాపై రూ. 62 కోట్లు భారం పడింది. ఈమేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన మీదట లోక్‌సభ సచివాలయం సమాచారం అందించింది. 2017-18 నుంచి 2021-22 వరకు ప్రస్తుత లోక్‌సభ సభ్యుల ప్రయాణాలకుగాను రూ.35.21 కోట్లు, మాజీ సభ్యులకు సంబంధించి రూ.26.82 కోట్లకు బిల్లు అందినట్లు వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రంగా ఉన్న 2020-21లో వరుసగా రూ.1.29 కోట్లు, రూ.1.18 కోట్లు చొప్పున ప్రస్తుత, మాజీ ఎంపీలు రైల్వే పాసులను వినియోగించినట్లు పేర్కొంది. సిట్టింగ్‌ ఎంపీలు రైళ్లలో ఏసీ మొదటి తరగతి లేదా ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కొన్ని నిబంధనలకు లోబడి వారి సతీమణులు కూడా ఉచిత ప్రయాణాలు చేయవచ్చు. మాజీ ఎంపీలకు సంబంధించి ఏ రైలులోనైనా ఒకరితో తోడుగా ఏసీ-2 టైర్‌లోను, ఒక్కరే అయితే ఏసీ-1 తరగతిలోనూ ప్రయాణించవచ్చు. ఈమేరకు వారి ప్రయాణాలకు సంబంధించిన బిల్లులను చెల్లింపుల కోసం రైల్వే పే అండ్‌ అకౌంట్స్‌ విభాగం లోక్‌సభ సచివాలయానికి పంపుతుంది. కాగా రైల్వేశాఖ కొంతకాలంగా సీనియర్‌ సిటిజన్లు తదితరుల ప్రయాణాలకు రాయితీలను నిలిపివేసింది. అధికారిక డేటా ప్రకారం.. 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు 7.31 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్‌ ప్రయాణికులకు రైల్వేశాఖ రాయితీలు ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని