పోలింగ్‌ స్టేషన్లలోకి ఫోన్లు నిషిద్ధం

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్లలోకి ఎలాంటి ఫోన్లు, వైర్‌లెస్‌ సెట్లు తీసుకెళ్లరాదని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Published : 03 Jul 2022 06:32 IST

రాష్ట్రపతి ఎన్నిక నిబంధనలపై ఈసీ ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ స్టేషన్లలోకి ఎలాంటి ఫోన్లు, వైర్‌లెస్‌ సెట్లు తీసుకెళ్లరాదని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా ఫోన్‌తో వస్తే ఆ విషయాన్ని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా ఫోన్‌ను అనుమతిస్తే అధికారులు ఆ విషయాన్ని కూడా అభ్యర్థులు/వారి ప్రతినిధులు, ఇతర ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. అలాగే అధికారులు, పర్యవేక్షకులు ఎవరూ పోలింగ్‌ స్టేషన్‌లోకి ఫోన్లు తీసుకువెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే ఏదైనా సమాచారం అందించడానికి వీలుగా ప్రత్యేక ఫోన్‌లైన్‌తో కూడిన కంట్రోల్‌ రూంని ఏర్పాటు చేయాలని తెలిపింది. ఎన్నికల సంఘం అధికారులు ఎప్పుడైనా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులతో సంప్రదించాలంటే ఈ లైన్‌నే వినియోగించాలని పేర్కొంది. ఒకవేళ కమిషన్‌తో సంప్రదించాలంటే పోలింగ్‌ స్టేషన్‌ బయటకు వచ్చి మాట్లాడాలని సూచించింది. ఈ నిబంధనలన్నీ ఓట్ల లెక్కింపు కేంద్రానికీ వర్తిస్తాయని తెలిపింది.

పోలింగ్‌ బూత్‌లో ఒక ఓటరు ఉన్నప్పటికీ.. దాన్ని పట్టించుకోకుండా మరో ఓటరు ఎవరైనా బ్యాలెట్‌తో లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఆ బ్యాలెట్‌ను ఎన్నికల అధికారులు వెనక్కు తీసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అలాంటి వారికి మళ్లీ తాజాగా బ్యాలెట్‌ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. అలా తీసుకున్న బ్యాలెట్‌ను రద్దుచేసి, ప్రత్యేక కవర్‌లోపెట్టి రిటర్నింగ్‌ అధికారికి పంపాలని సూచించింది. ఒకవేళ అధికారుల మాట పట్టించుకోకుండా ఏ ఓటరైనా తన బ్యాలెట్‌ను బలవంతంగా బాక్స్‌లో వేస్తే, ఆ వ్యక్తికి ఇచ్చిన సీరియల్‌ నంబర్‌ను గుర్తించి, రహస్య ఓటింగ్‌ విధానాన్ని ఉల్లంఘించిన తీరును వివరిస్తూ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రిటర్నింగ్‌ అధికారికి నివేదిక పంపాలని సూచించింది. లెక్కింపు సమయంలో రిటర్నింగ్‌ అధికారి ఆ ఓటును గుర్తించి తిరస్కరించవచ్చని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని