Published : 04 Jul 2022 05:06 IST

సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిందే

జడ్జీలపై వ్యక్తిగత విమర్శలకూ వాటిని వాడుకుంటున్నారు

లక్ష్మణ రేఖను దాటడం ప్రమాదకరం

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పార్దీవాలా

దిల్లీ: రాజ్యాంగం కింద చట్టబద్ధ పాలనను పరిరక్షించాలంటే దేశంలో తప్పనిసరిగా డిజిటల్‌, సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.బి.పార్దీవాలా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా, ఒక ఎజెండా ప్రకారం జడ్జీలపై ఈ మాధ్యమాల ద్వారా దాడులకు పాల్పడుతూ లక్ష్మణరేఖను అతిక్రమించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. సస్పెండైన భాజపా నేత నుపుర్‌ శర్మకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలతో అభ్యంతరం వెలిబుచ్చిన ధర్మాసనంలో జస్టిస్‌ పార్దీవాలా కూడా ఉన్న విషయం తెలిసిందే. దానిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయమూర్తి ఆదివారం దిల్లీలో జరిగిన ‘‘జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా జాతీయ చర్చాగోష్టి’’లో ప్రసంగించారు. అయోధ్య భూ వివాద కేసును ఆయన ప్రస్తావిస్తూ- పూర్తిగా న్యాయపరమైన, రాజ్యాంగ సంబంధిత అంశాలనూ మన దేశంలో సామాజిక మాధ్యమాలు రాజకీయమయం చేస్తున్నాయని చెప్పారు. డిజిటల్‌ మాధ్యమాలు సమాంతరంగా విచారణ చేస్తూ అనుచిత రీతిలో న్యాయ నిర్వహణ వ్యవస్థలో వేలు పెడుతున్నాయని అన్నారు.

ప్రజాభిప్రాయం ప్రభావం తీర్పులపై పడకూడదు 

‘జడ్జీలు ఇచ్చే తీర్పులపై దాడులు ప్రమాదకర పరిస్థితికి దారితీస్తాయి. చట్టం ఏం చెబుతోందనేదానికంటే మీడియా ఏం ఆలోచిస్తుందనేదానిపైనే ఎక్కువగా దృష్టిపెట్టే పరిస్థితి నెలకొంటోంది’ అని జస్టిస్‌ పార్దీవాలా చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రభావం కోర్టు తీర్పులపై పడకూడదని అన్నారు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడం క్లిష్టమైన కసరత్తుగా పేర్కొన్నారు. డిజిటల్‌, సామాజిక మాధ్యమాలు అర్ధ సత్యాలతో న్యాయ ప్రక్రియను సమీక్షిస్తున్నాయని అన్నారు. న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ, కట్టుబాట్లు, ఇతరత్రా పరిమితుల గురించి వాటికి తెలియవని చెప్పారు. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడం, పరస్పర ఆమోదంతో స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పడం వంటివి ప్రజల సెంటిమెంట్లకు విరుద్ధమైనా చట్టనిబంధనల ప్రకారం సబబేనని వివరించారు. జడ్జీలు కాకుండా వారి తీర్పులే మాట్లాడాలన్నారు.


దేశీయ ప్రయోజనాలను విస్మరించకూడదు: జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ మాట్లాడుతూ- అంతర్జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తూనే దేశీయ ప్రయోజనాలను మాత్రం విస్మరించకూడదని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఆలోచించి, స్థానిక స్థాయిలో పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటల్ని ఆయన గుర్తుచేశారు. హక్కులు, బాధ్యతలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలని చెప్పారు. విధులకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ రామాయణం, భగవద్గీతలను ఆయన ప్రస్తావించారు. భారతీయ నాగరికతలోనే దీనికి సంబంధించిన బలమైన మూలాలు ఉన్నాయని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని