ఎన్‌సీఎస్సీకి ఆ అధికారం లేదు

ఒక యజమాని తన ఉద్యోగి విషయంలో తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే అధికారం జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ (ఎన్‌సీఎస్సీ)కి లేదని బొంబాయి హైకోర్టు జూలై 27న స్పష్టం చేసింది. సంబంధిత ఉత్తర్వు ప్రతి శుక్రవారం

Published : 06 Aug 2022 05:11 IST

ఉద్యోగిపై క్రమశిక్షణ చర్య విషయంలో హైకోర్టు స్పష్టీకరణ

ముంబయి: ఒక యజమాని తన ఉద్యోగి విషయంలో తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే అధికారం జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ (ఎన్‌సీఎస్సీ)కి లేదని బొంబాయి హైకోర్టు జూలై 27న స్పష్టం చేసింది. సంబంధిత ఉత్తర్వు ప్రతి శుక్రవారం విడుదలైంది. షెడ్యూల్డ్‌ కులానికి చెందిన చంద్రప్రభా కెడారే అనే స్టాఫ్‌ నర్సుపై రక్షణ శాఖ తీసుకున్న క్రమశిక్షణ చర్యపై పునఃపరిశీలన జరపాలని ఎన్‌సీఎస్సీ ఈ ఏడాది మార్చిలో ఆదేశించింది. దీన్ని రక్షణ శాఖ సవాలు చేయగా.. ఎన్‌సీఎస్సీకి ఈ అంశంలో జోక్యం చేసుకునే అధికారం లేదని బొంబాయి హైకోర్టు డివిజన్‌ ధర్మాసనం స్పష్టంచేసింది. చంద్రప్రభ మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని దేవలాలి కంటోన్మెంట్‌ బోర్డులో 1973 జనవరిలో స్టాఫ్‌ నర్సుగా నియమితులయ్యారు. 2013లో ఆమెపై క్రమశిక్షణ చర్య తీసుకుని, నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించారు. దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ చంద్రప్రభ ఎన్‌సీఎస్సీని ఆశ్రయించారు. రక్షణ శాఖ తగు విధివిధానాలను పాటించకుండా చంద్రప్రభతో నిర్బంధంగా ఉద్యోగ విరమణ చేయించిందని కమిషన్‌ ఈ ఏడాది మార్చిలో తీర్మానించింది. దీన్ని రక్షణ శాఖ హైకోర్టులో సవాలు చేసింది. నిర్బంధ ఉద్యోగ విరమణ ఉత్తర్వుకు వ్యతిరేకంగా చంద్రప్రభ న్యాయపరంగా వీలైన మార్గాలన్నింటిలో పోరాడినా ఫలితం లేకపోవడం వల్లనే ఎన్‌సీఎస్సీని ఆశ్రయించారని హైకోర్టు పేర్కొంది. తన ఉద్యోగిపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం యజమానికి ఉందని, అది చట్టబద్ధంగా జరిగినప్పుడు ఉద్యోగి షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ను ఆశ్రయించడం కుదరదనీ తేల్చిచెప్పింది. కమిషన్‌ ముందు చంద్రప్రభ వేసిన పిటిషన్‌నూ, దానిపై కమిషన్‌ ఉత్తర్వునూ ఈ సందర్భంగా హైకోర్టు కొట్టివేసింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని